కేబినెట్ విస్తరణ,ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు నిర్వహించిన సీఎం కేసీఆర్ ఫైనల్ లిస్ట్‌ను రెడీ చేశారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పార్టీకి విధేయులుగా,కేసీఆర్‌కు నమ్మకస్తులుగా ఉన్న వారికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.
మార్చిలో ఖాళీ కానున్న 16 ఎమ్మెల్సీ స్ధానాల్లో 15 టీఆర్ఎస్ గెలుచుకోనుంది. ఎమ్మెల్యే కోటాలో ఒక స్ధానంలో కాంగ్రెస్ గెలవనుండగా టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో సీఎం కేసీఆర్ విధేయతకే పెద్దపీట వేశారని సమాచారం. పార్టీ బలోపేతం,పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేశారట.
మొదటి నుండి కేసీఆర్ వెంట నడిచిన అత్యంత నమ్మకస్తుడు,ప్రస్తుతం సీఎం రాజకీయ సలహాదారుగా ఉన్న శేరి సుభాష్ రెడ్డి, మాజీ మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు,నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి,మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పేర్లు లిస్టులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
వీరితో పాటు హోం మంత్రి మహమూద్ అలీ,మార్చిలో పదవికాలం ముగియనున్న ఎమ్మెల్సీ సలీంకు మరోసారి అవకాశం కల్పించారట. వీరితో పాటు టీఎస్‌ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు,వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత తక్కళ్లపల్లి రవీందర్ రావు,టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరిన రంగారెడ్డి డీసీసీబీ ఛైర్మన్ క్యామ మల్లేష్‌ల అభ్యర్ధిత్వం ఖరారైనట్లు సమాచారం.
అలాగే ఇటీవలె కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్‌లో చేరిన టీ సంతోష్‌కు బెర్త్ కన్ఫామే అంటూ ప్రచారం జరుగుతుండగా వరంగల్ జిల్లాకు చెందిన సత్యవతి రాథోడ్, మాలోతు కవిత పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని సమాచారం. మొత్తంగా ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్ అఫిషియల్‌గా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.