నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..

533
cm kcr
- Advertisement -

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. నేటి సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త మంత్రులకు సంబంధించిన పేర్లను కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందించారు.ఆదివారం దశమి కావడంతో.. సాయం త్రం నాలుగు గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లుచేయాలని సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఆదేశించారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్‌లో క్యాబినెట్ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో సోమవారం ప్రవేశపెట్టే బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది.

kcr

గవర్నర్‌కు ముఖ్యమంత్రి అందించిన జాబితాలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్‌ల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాపై సబితకు మంచి పట్టు ఉండడంతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమెకు, గిరిజన మహిళ కోటాలో సత్యవతి రాథోడ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, ఆర్టీసీ చైర్మన్‌గా మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని నియమించనున్నారు. శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. తొలిసారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేయగా, ఫిబ్రవరి 19న 10 మంత్రులతో కేబినెట్ కొలువుదీరింది. తాజాగా ఇవాళ మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిపేందుకు సర్వం సిద్ధమైంది. అయితే ఈసారి ఎంతమందికి ఛాన్స్ లభిస్తుందో అనేది ఉత్కంఠగా మారింది.

- Advertisement -