పాలమూరులో గులాబీజెండా ఎగరేస్తాం:కేసీఆర్

262
kcr jadcharla
- Advertisement -

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి నిబద్దత కలిగిన ప్రజానాయకుడని ఆయన్ని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సీఎం కేసీఆర్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఓడినా గెలిచినా లక్ష్మారెడ్డి జడ్చర్ల ప్రజల వైపే ఉన్నారని తెలిపారు.పాలమూరులో 14 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరేయాలని ప్రజలను కోరిన కేసీఆర్.. 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు.

అందరం కలిసి పట్టుబట్టి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామన్నారు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు. పాత పాలమూరు జిల్లాలో ఎనమిదిన్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకోగలిగామన్నారు. వలసలు పోయిన వారు పాలమూరుకు తిరిగివస్తున్నారని చెప్పారు.

తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్న కల నెరవేర్చుకుందామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఉద్దండపూర్ రిజర్వాయర్ ద్వారా మహబూబ్ నగర్ సస్యశ్యామలం అవుతుందన్నారు. చంద్రబాబు మిమ్మల్ని వదల బొమ్మాళి వదలా అంటున్నారని టీడీపీని తరిమికొట్టాలన్నారు. మహబూబ్ నగర్‌లో టీడీపీ అభ్యర్ధి ఏం మొఖం పెట్టుకుని పోటీచేస్తున్నారని ప్రశ్నించారు.

మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. అదే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో పాలమూరుకు మహార్దశ పట్టిందన్నారు. జరుగుతున్న అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందన్నారు. పాలమూరు జిల్లాలో వేల కోట్ల అభివృద్ధి పనులు నడుస్తున్నాయని చెప్పారు. పాలమూరు ఎత్తిపోథల పథకాన్ని ఆపాలని ఢిల్లీకి ఉత్తరం రాసిన చంద్రబాబు ఏ విధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ గందరగోళం అవుతుందన్నారు.

ఎన్నికలు వస్తే ఆగమాగం కావొద్దని ఆలోచించాలని ప్రజలకు సూచించారు. చంద్రబాబుకు ఓటేసీ పాలమూరు ఎత్తిపోథల పథకాన్ని ఆపుకుందామా ఆలోచించాలన్నారు. వలసలు,కరువుతో సతమతమవుతున్న జిల్లా అభివృద్ధి కావాలా వద్దా అన్నారు.

బంగారు తెలంగాణ సాధించే వరకు విశ్రమించేది లేదని తెలిపిన కేసీఆర్ అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే టీఆర్ఎస్‌కే ఓటేయాలన్నారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్న సీఎం టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామన్నారు. రైతు బంధుతో రైతుల్లో ధీమా పెంచామన్నారు. నిరుద్యోగులకు రూ. 3వేల భృతి అందిస్తామన్నారు.

- Advertisement -