తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అన్నారు కేసీఆర్. వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాట్లాడిన కేసీఆర్… ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు నంబర్-1 విలన్ కాంగ్రెస్ … వద్దంటే ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్… 1969లో 369 మంది తెలంగాణ బిడ్డల్ని బలి తీసుకున్నది కాంగ్రెస్ అన్నారు. 2001 నుంచి టిఆర్ఎస్ సృష్టించిన ప్రభంజనాన్ని చూసి, 2004 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్… తెలంగాణ ఇస్తనని మాట ఇచ్చి ఎగ్గొట్టాలని చూసింది కాంగ్రెస్
నేను, జయశంకర్ సార్ కలిసి 36 పార్టీల దగ్గర లేఖలు తెచ్చినం అన్నారు. దానికోసం మేం ఎక్కని కొండ లేదు, మొక్కని బండలేదు, ఈ కాంగ్రెస్ నానుస్తుంటే కేంద్రమంత్రి పదవిని విసిరి కొట్టిన… చివరికి చావు నోట్లో తలపెట్టి దీక్ష చేస్తే డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది అన్నారు.
ఆ తర్వాత మాట మార్చి మూడేండ్లు రాచిరంపాన పెట్టింది కాంగ్రెస్.. 1969 నుంచీ 2014 దాకా వందలాది మంది యువకులను బలిదీసుకున్న బ్రహ్మ రాక్షసి కాంగ్రెస్, సబ్బండ వర్ణాలను ఏకంచేసింది గులాబీ జెండా… రాజకీయ అనివార్యత సృష్టించింది గులాబీ జెండా,కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చింది గులాబీ జెండా,ఎలక్షన్లపుడు కాంగ్రోసోళ్లు చెప్పిన మాటలేంటియి?,ఓ ఇగ మామూలు వాగ్ధానాలు చేసిన్రా.. మామూలు కథనా?,ఒకణ్ణి మించి ఒకడు చెప్పిరి,ఇక్కడోళ్లు చాలరని గాంధీల మీద గాంధీలు దిగిరి,ఉన్న గాంధీ, లేని గాంధీలు అందరొచ్చిరి, ఏం చెప్పుడది ? అర చేతుల వైకుంఠం చూపిరి అన్నారు.
ఆరు సందమామలు – ఏడు సూర్యులు… కేసీఆర్ రైతు బంధు 10 వేలిస్తే.. మేం 15 వేలిస్తం,కేసీఆర్ పెన్షన్లు 2 వేలే ఇస్తున్నడు.. మేం 4 వేలిస్తం ,ఇంట్ల ఇద్దరుంటె కేసీఆర్ ఒక్కలకే ఇస్తున్నడు,మేం ముసలయ్య, ముసలవ్వ – ఇద్దరికిస్తం,దివ్యాంగులకు 4 వేలు కాదు ఆరు వేలిస్తమన్నరు,ఇండ్లల్ల ఉండే ఆడోళ్లకు నెలకు మనిషికి 2500 ఇస్తం,లగ్గమయ్యెటోళ్లకు కేసీఆర్ లక్షనే ఇస్తుండు, మేం తులం బంగారం కలిపి ఇస్తం,సదువుకునే ఆడి పోరగాండ్లకు స్కూటీలిస్తమన్నరు,ఉరుకున్రి, ఉరుకున్ని…. బ్యాంకుల 2 లక్షల అప్పు తెచ్చుకోన్రి,డిసెంబర్ 9 నాడు ఒక్క పోటుతోని ఖతం అన్నరు అన్నారు.
ధాన్యం కేసీఆర్ వట్టిగ మద్దతు ధరకే కొంటున్నడు ..మేం ఎక్స్ ట్రా 500 కట్టిస్తం అన్నరు, సదువుకునే పోరగాండ్లకు 5 లక్షల కార్డు ఇస్తం అన్నరు, ఇంక ఇవిగాక 420 హామీలిచ్చిన్రు అన్నారు. పెద్ద పెద్ద బుక్కులు కొట్టిచ్చి పంచిన్రు..అడ్డం పొడుగు చెప్తున్నరు, యాడికెల్లి ఇస్తరు వయా అంటే.. జబ్బలు చరిచిరి, బొబ్బలు పెట్టిరి, తొడలు కొట్టిరి అన్నారు. మాది 120 ఏండ్ల పార్టీ.. వనరులు ఎట్ల సమీకరించుకోవాల్నో మాకు తెలిసినంత ఎవరికీ తెల్వదు…ఇపుడున్న ఆర్ధిక మంత్రి అయితే చేస్తం, చేస్తం, చేసి చూపిస్తం అని టీవీల చెప్పిన మాట నేనే విన్న, తీరా చూస్తే ఏమైంది… పెద్ద మొగోడని మొల్కలు అల్క పిలిస్తే.. ఓ గదెంత పని అని వచ్చిండు, ఆయింత ఎల్కను చూసి ఎల్లెల్కల పడ్డడు,మొల్క అల్క మొగన్ని పిలిస్తే.. ఎల్కను చూసి ఎల్లెల్కల పడ్డడు,ఎక్స్ ట్రాలు ఇచ్చుడేమో గానీ, ఉన్నయి ఊశి పోయినయి,అన్న వస్త్రానికి పోతే.. ఉన్న వస్త్రాలు ఊడి పోయినయి అని ఎద్దేవా చేశారు.
ఈ ఇంత పొడుగు, అంత పొడుగు గాళ్లంత ఏం చేసిన్రు?,ఎత్తడు, తవ్వడు, మొయ్యడు.. అని ముగ్గురు కల్సి బాయి తోడితే యాడాదిన్నరైనా తట్టెడు మట్టి తీసింది లేదు…ఏమాయెరా అంటే.. రేపే మొదలు, సంక్రాంతికి అంటే, దీపావళికి అంటే, తారీఖుల మీద తారీఖులు, ఎవడన్నా ఇల్లు నిలబెట్టాలె గనీ, కూలగొడ్తరా?,మేమేమో బస్తీల పేదలు గుడిసెలేసుకుంటే పట్టాలిచ్చినం,వీళ్లేమో బుల్డోజర్లు పెట్టి ఇండ్లు కూలగొడుతున్నరు అన్నారు. దరాబాదుల ఒక తమ్ముడు ఆయన ఇల్లు కూలగొట్టినరేమో కేసీఆర్ అన్నా.. ఎక్కడున్నవు..? నువ్వు రావాలె అని మాట్లాడుతున్నడు, అప్పుడు నేను కాలికి బలపం కట్టుకొని చిలకకు చెప్పినట్లు చెప్పిన కాంగ్రెస్ మాటలు పట్టుకుంటే ఏమైతదని.. ఏమైతదీ?, తీర్థం పోదాం తిమ్మక్కా అంటే.. నువ్వు గుల్లె, నేను సల్లె అన్నట్టయితది అన్నారు. గాడుదులకు గడ్డేసి, బర్రెల పాలు పిసికితే ఎట్లా… కేసీఆర్ అన్నా.. ఏం జెయ్యాలె అంటివి, కత్తి వాళ్లకు ఇస్తివి, యుద్ధం నన్ను చెయ్యమంటివి..అయితే, ఈ మోసకారి కాంగ్రెసోళ్లు ఆగం చేస్తే మనం ఆగమైతమా.. ఇంట్ల కూసుంటమా?,కొట్లాడుదాం, నిలదీద్దాం, పోరాడుదాం, మీ వెంట కేసీఆర్ ఉంటడు, బీఆర్ఎస్ ఉంటది, గులాబీ జెండా ఉంటది, ఇంక కూడా ఆగం చేస్తరు వీళ్లు…గీ ముచ్చట్లు అసెంబ్లీల అడిగితేనే.. సమాధానం చెప్తలేరు,కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి రా.. అంటరు, గీ కాయ కొరుకుడు ముచ్చట్లు ఇనెటందుకు రావాల్నా?,మా ఎమ్మెల్యేలు అడిగితేనే సమాధానం చెప్పే సత్తా లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:24 గంటల కరెంట్ ఇవ్వలేదా?: కేసీఆర్

