ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం:కేసీఆర్

237
kcr siddipet
- Advertisement -

ఐకేపీ సెంటర్ల ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. సిద్దిపేట,దుబ్బాక నియోజకవర్గాల ప్రచారసభలో మాట్లాడిన సీఎం సిద్దిపేట ప్రజలు అందించిన స్పూర్తి, విశ్వాసంతో స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకున్నామని తెలిపారు. తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని రకరకాల ప్రచారం చేశారని కానీ అనతికాలంలో వాటిని పటాపంచలు చేస్తూ తెలంగాణ ముందుకుపోతోందన్నారు. సిద్దిపేట ప్రజలకు చైతన్యం ఎక్కువన్నారు.

తెలంగాణను దేశంలో నెంబర్ వన్ చేశామన్నారు. సిద్దిపేట,దుబ్బాకలో టీఆర్ఎస్ లక్ష మెజార్టీతో గెలుస్తుందన్నారు. సిద్దిపేటకు వచ్చే సంవత్సరం నాటికి నీళ్లు,రెండేళ్లలో రైలు వస్తుందన్నారు.మిషన్ భగీరథతో తాగునీటి సమస్య తీరిందన్నారు. జర్నలిస్టుగా వచ్చి ప్రజాదీవెనలతో రామలింగారెడ్డి ముందుకుసాగుతున్నారని చెప్పారు.

Image result for kcr siddipet

భవిష్యత్‌లో రెప్పపాటు కూడా కరెంట్ పోదన్నారు. రైతులు బాగుండాలని రైతు బాగుంటే దేశం బాగుంటుందన్నారు. తెలంగాణ రైతుల అప్పులు పోయి బ్యాంకుల్లో డబ్బులు నిల్వ ఉండే పరిస్థితి రావాలన్నారు. భూరికార్డుల ప్రక్షాళన,రైతు బంధుతో చేయూత నందించామని చెప్పారు. వచ్చే ఏడాది నుండి రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు 10 వేల పెట్టుబడిని అందిస్తామని స్పష్టం చేశారు కేసీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చి తీరుతామన్నారు.

తెలంగాణను పంటల కాలనీలుగా విభజించి రైతులు పంటలు వేయాలన్నారు. రైతులు పండించిన పంటకు డిమాండ్ ఉండాలన్నారు. గ్రామాలలో ఉండే స్వయం సహాయక బృందాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లలో కొనుగోలుచేస్తామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఐకేపీ సెంటర్ల ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్నారు. మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలని సూచించారు. రైతు రాజు అయ్యే వ్యవస్థ తెలంగాణలో రావాలన్నారు.

తెలంగాణలో కుంభకోణాలు,భూకబ్జాలు లేవన్నారు. అవినీతి లేకుండా ప్రజలకు మంచి పాలన అందిస్తున్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ దే గెలుపని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు.

- Advertisement -