KCR:కాంగ్రెస్ అంటే సర్వ భ్రష్టం

7
- Advertisement -

రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీయడానికి తెలంగాణకు ఇప్పుడు వాయిస్‌ ఎవరు? తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలి? ప్రతిపక్షమే కదా? మాకు రెండు ప్రధాన బాధ్యతలున్నాయి. ఒకటి – తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండోది – ప్రధాన ప్రతిపక్షంగా. ఈ రెండు బాధ్యతలను నిర్వర్తించడం మా కర్తవ్యం. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అడ్డం పొడుగు మాటలు చెప్పి, కూతలు కూస్తే సరిపోతుందనుకుంటే అది జరగదు. ఇప్పటివరకు ఒక రకంగా ఉన్నా, రేపటి నుంచి మరో రకంగా ఉంటుంది. అవసరమైతే ఎక్కడికక్కడ నిలదీస్తాం అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలతో కలిసి ప్రతి అంశాన్ని అడుగడుగునా చెక్‌ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం మారిందని తొందరపడి ఎలాంటి చర్యలకు పాల్పడలేదని, కానీ ఇష్యూల మీద మాత్రమే పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. వక్ఫ్‌ భూములు, భూదందాలు, దోపిడీ, లగచర్ల వంటి అంశాలపై పార్టీ బలంగా పోరాడుతోందని అన్నారు.

ఇప్పుడు రాష్ట్రానికి మొదటికే ముప్పు వస్తోందని కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి మీద ఏపీ ప్రభుత్వం నీళ్ల దోపిడీ చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండటం దురదృష్టకరమన్నారు. కృష్ణా జలాల్లోనూ పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం జరుగుతున్నా స్పందన లేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో తానే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. నాలుగు రోజుల్లో జిల్లాల నాయకులతో సమావేశాలు నిర్వహించి, గ్రామగ్రామాన ప్రజలను చైతన్యం చేస్తామని చెప్పారు.

Also Read:కోడిగుడ్లతో క్యాన్సర్‌ ప్రమాదం లేదు!

ప్రభుత్వ హామీలపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రైతుబంధు, మహిళలకు ఆర్థిక సాయం, పెన్షన్లు, రుణమాఫీ, విద్యార్థుల సంక్షేమం—ఏ ఒక్క హామీ పూర్తిగా అమలుకాలేదని అన్నారు. ప్రజలను మాయ మాటలతో మోసం చేశారని, మొత్తం 420 హామీల్లో కొన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర హక్కులు, నీళ్ల హక్కులు, ప్రజల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాడుతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

- Advertisement -