తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్లో జరిగిన ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణంలో పాల్గొన్న సీఎం కేసీఆర్…ప్రజలందరికీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారుతుందని…. ప్రజలందరికీ సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. ప్రజల మద్దతు, దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఏ రాష్ట్రం సాధించనన్ని అద్భుత ఫలితాలు తెలంగాణ సాధించిందని, దళితబంధు వంటి అనేక ఆవిష్కరణలు గావించామని వెల్లడించారు.
రాష్ట్రంలో భూముల ధరలు బాగా పెరిగాయని, రాష్ట్రంలోని మారుమూల గ్రామంలోనూ భూమి ధర పెరిగిందన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి వల్లే భూముల ధరలు పెరిగాయన్నారు. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని వెల్లడించారు. కులం, మతం, జాతి వివక్ష లేకుండా ముందుకువెళ్తున్నామని చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నామన్నారు.