డ్రగ్స్ కేసులో పారదర్శకంగా విచారణ జరుగుతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్ తెలుగు సినీ పరిశ్రమను లక్ష్యం చేసుకున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. డ్రగ్స్ తీసుకోవడం నేరం కాదని ఆయన తెలిపారు. డ్రగ్స్ వ్యాపారులు, సరఫరాదారుల ఆనవాళ్లు తెలుసుకునేందుకు, డ్రగ్స్ చొరబడుతున్న విధానం, అమ్మకం జరుగుతున్న ప్రదేశాలు వంటి వివరాలు తెలుసుకునేందుకే విచారణ జరుగుతున్నట్టు ఆయన తెలిపారు.
డ్రగ్స్ ,గుడుంబా వ్యాపారాలపై సమాచారమిస్తే లక్ష రూపాయల నజరానాను ప్రకటించారు. డ్రగ్స్, గుడుంబా సమాజాన్ని నిర్వీర్యం చేస్తాయని వాటి వాడకం ప్రమాదకరం అని తెలిపారు. డ్రగ్స్ బారినపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు. వాటిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన తెలిపారు. సిట్ పనితీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదని, ఎవరినీ లక్ష్యం చేసుకుని తాము పనిచేయమని అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటామని ఆయన చెప్పారు. హైదరాబాదు నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తయారు చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేసే వారిలో సినిమావారుంటే కేసులు పెడతామని స్పష్టం చేశారు. డ్రగ్స్ సరఫరా చేసేవారు, అమ్మేవారు ఎంతటి వారైనా క్షమించేది లేదని తేల్చి చెప్పారు.
ఈ సమావేశంలో డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ఇంటెలీజెన్స్ ఐజీ నవీన్ చంద్, సెక్యూరిటీస్ ఐజీ ఎన్ కే సింగ్, ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, సైబరాబాద్ జాయింట్ సీపీ షానవాజ్ ఖాసిం, తరుణ్ జోషి తదితరులు పాల్గొన్నారు.