సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితమంతా కృషి చేసిన తెలంగాణ మట్టి బిడ్డ సురవరం, కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రగామి పాత్ర పోషించి, మార్క్సిస్టు ప్రజానేతగా గొప్ప పేరు సంపాదించుకున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. శోకసంతప్తులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ హృదయపూర్వక సానుభూతి తెలిపారు.
భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు, కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచి వామపక్ష భావజాలం కలిగిన సురవరం గారు చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం అవిశ్రాంత పోరాటం చేశారని గుర్తుచేసుకున్నారు.
విద్యార్థి దశ నుంచే అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని, దేశ రాజకీయాల్లో ముఖ్యంగా వామపక్ష రాజకీయాల్లో వారు క్రీయాశీలక పాత్ర పోషించారని, వారి మరణంతో దేశం ఒక గొప్ప ప్రజాస్వామిక వాదిని కోల్పోయిందని పేర్కొన్నారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికైన సురవరం గారు ప్రజా సమస్యల విషయంలో నిరంతరం ముందుండి పోరాటం చేశారని అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు. సురవరం గారి కుటుంబ సభ్యులు, అభిమానులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సిపిఐ అగ్ర నాయకులు, నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన మరణం తెలంగాణ రాజకీయాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు…సురవరం సుధాకర్ రెడ్డి తన జీవితాన్ని ప్రజల కోసం, పేదల అభ్యున్నతి కోసం అంకితం చేశారు.నల్లగొండ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన అందించిన సేవలు అపారమైనవి. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన నిలువుటద్దం. ఆయన పోరాట స్ఫూర్తి, నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకం.ఆయన కుటుంబానికి, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. సురవరం సుధాకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు.
Also Read:సీపీఐ నేత సురవరం ఇకలేరు..
సిపిఐ అగ్ర నాయకులు, పార్లమెంట్ మాజీ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం ఎంతో బాధాకరం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన ప్రజాసేవ, ఉద్యమ పంథా చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి… సురవరం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు.

