తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని, వారు తెలంగాణ కోసం చేసిన కృషిని, త్యాగాన్ని , తెలంగాణ తొలిముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు.
తొలిదశనుంచి మలి దశ ఉద్యమం దాకా తెలంగాణ సాధన దిశగా వారు చేసిన భావజాల వ్యాప్తి, దశాబ్దాలపాటు సాగిన ఉద్యమంలో వారు అందించిన అచంచల పోరాట స్ఫూర్తి అజరామరమైనదని కేసీఆర్ కొనియాడారు.
వారి అడుగుజాడల్లో తాను మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి, చివరి దాకా శాంతియుత పద్దతిలో, పార్లమెంటరీ పంథాలో ప్రజా ఉద్యమాన్ని కొనసాగించి, అరవై ఏండ్ల స్వయంపాలన ఆకాంక్షను నిజం చేసుకున్నామని కేసీఆర్ అన్నారు.
రాష్ట్ర సాధనాన అనంతరం ప్రజల మద్దతుతో స్వరాష్ట్రంలో ప్రారంభమైన మొట్టమొదటి ప్రభుత్వాన్ని ప్రొఫెసర్ జయశంకర్ స్పూర్తితోనే కొనసాగించమని తెలిపారు.
ఉద్యమాన్ని నడిపి గమ్యాన్ని చేరుకోవడంలోనూ., తదనంతరం పదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించడంలోనూ వారి స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్ తెలిపారు.
స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలను, సకలజనులను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన బిఆర్ఎస్ పాలన అందించిన స్ఫూర్తిని కొనసాగిస్తూ, తెలంగాణను మరింతగా ప్రగతి పథంలో నడిపేలా కృషి చేయడమే వారికందించే ఘన నివాళి అని కెసిఆర్ పేర్కొన్నారు.
Also Read:తెరుచుకున్న నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు..