లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం కేసీఆర్ అల్లాదుర్గంలో జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం. ఎన్నికలు చాలా వస్తయి.. చాలా మందిని గెలిపించా. ఏం జరిగితే రాష్ట్రానికి దేశానికి మంచి జరుగుతుందో మీ బస్తీల్లో, ఊరిలో మాట్లాడుకోవాలి. ఎన్నికలు అనగానే ఆగమాగం కావొద్దని కేసీఆర్ అన్నరు.
ఐదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడెలా ఉందో మీరు ఆలోచన చేయాలని సీఎం సూచించారు. ఆనాడు కరెంట్ కష్టాలు ఎలా ఉండేవి. ఇపుడెలా ఉన్నాయి.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. మిషన్ భగీరథ కొద్ది రోజుల్లో పూర్తి అవుతుంది. ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తాం.. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా తీసుకొచ్చాం. రైతు బంధు కింద ఇక నుంచి ఏడాదికి రూ.10వేలు ఇస్తామన్నారు.
నేను కూడా ఈ మట్టిలో పుట్టిన బిడ్డనే. ఆందోల్ నియోజకవర్గంలో నేను ఎన్నిసార్లు పాదయాత్ర చేశానో ఇక్కడి ప్రజలకు తెలుసు. ఆందోల్ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సింగూరు నీళ్లిచ్చినం. కరెంట్ సమస్య తీరింది.. తాగునీటికి కొరత లేదు. ఆందోల్‌లో యువ జర్నలిస్టు క్రాంతి కిరణ్‌ను మీరు గెలిపించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో బీబీ పాటిల్‌ను పెద్ద ఎత్తున ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు.