భారత రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ సదా స్మరణీయుడు అని సీఎం కేసీఆర్ తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్న సీఎం…ఎప్పటికి స్పూర్తి ప్రధాతగానే నిలుస్తారని తెలిపారు. భారత సమాజ పురోగతికి అవసరమైన ప్రణాళికలు రూపొందించిన మహానీయుడు అని… అంబేద్కర్ దూరదృష్టి, కాల్పనికత వల్లే దేశం ముందడుగు వేస్తుందని తెలిపారు కేసీఆర్.
అంబేద్కర్‌ను గుర్తు చేసుకోవడమంటే ఆయన ఆశయాలను కొనసాగించడమేనన్నారు మండలి ఛైర్మన్ స్వామి గౌడ్. అంబేడ్కర్ ఆలోచనా విధానం మనందరికీ ఆదర్శనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సభాపతి మధుసుదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, డిప్యూటీ సీఎం
మహమూద్ అలీ, మండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించినంత కాలం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే జీవించారు. వెలివాడల్లోని దళితులకు సముచిత స్ధానాన్ని కల్పించేందుకు అవిశ్రాంత పోరాటం చేశాడు. తాను నమ్మిన సిద్ధాంతం, తన ప్రతిపాదనలను వైరివర్గానికి సహేతుకంగా వివరించేందుకు నిద్రను త్యాగం చేశాడు.
అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. వేదాలు,ఉపనిషత్తులు,ఇతిహాసాలు చదివి మనువు అసలు రూపాన్ని తెలుసుకున్న అంబేద్కర్ దురదృష్టవశాత్తూ నేను హిందువుగా పుట్టాను.. కానీ హిందువుగా మాత్రం మరణించను అంటూ సంచలన ప్రకటన చేశారు. అన్నట్లుగానే 1956 అక్టోబర్ 14న నాగపూర్‌లో బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ధం స్వీకరించారు.