రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనం..సీఎంకు కేసీఆర్‌ లేఖ

16
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగలేఖ రాశారు. ప్రభుత్వం పక్షాన మీరు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని మీరు నాకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాన నేను మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను అని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమనీ, అమరుల త్యాగాల పర్యవసానమనీ కాకుండా, కాంగ్రెస్‌దయాభిక్షగా ప్రచారం చేస్తున్న మీ భావ దారిద్య్రాన్ని నేను మొట్టమొదట నిరసిస్తున్నాను. 1969 నుండీ ఐదు దశాబ్దాలు, భిన్నదశలలో, భిన్నమార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది. చరిత్ర పొడుగునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది మీరు దాచేస్తే దాగని సత్యం అన్నారు.

1952 ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నది ఆదిగా, కాంగ్రెస్ క్రూర చరిత్ర కొనసాగింది.
ఫజల్‌అలీ కమీషన్‌సిఫార్సులను కాలరాచి, తెలంగాణ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఆంద్రప్రదేశ్‌ఏర్పాటు చేసి, తెలంగాణలో ఐదారు తరాల ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్‌పార్టీది అని లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది ముక్కుపచ్చలారని యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్‌ దమననీతికి సాక్ష్యమే గన్‌పార్క్‌అమరవీరుల స్థూపం. ఆ స్థూపాన్ని కూడా ఆవిష్కరించుకోనివ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్‌కర్కశత్వం తెలంగాణ చరిత్ర పుటలలో నిలబడిపోయింది. మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకుల ప్రాణాలను బలిగొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్‌పార్టీదే. తెలంగాణకు కాంగ్రెస్‌చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిగిన చారిత్రాత్మక ప్రయత్నమే టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం. పార్లమెంటరీ రాజకీయ పంథాలో, శాంతియుత మార్గంలో తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ఏర్పడటం తెలంగాణ ఉద్యమంలో మేలిమలుపు.

టి ఆర్‌ఎస్‌తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వ్యక్తీకరణ నిచ్చింది, తెలంగాణ వాదాన్ని తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచింది. తెలంగాణ డిమాండ్ కు విస్తృత ఆమోదాన్ని సాధించింది. ఎన్నికలను ప్రభావితం చేసేస్థాయికి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ను చేర్చింది. ఊరూరా వాడవాడలా సభలూ సమావేశాలూ నిర్వహించి భావజాల వ్యాప్తి చేసింది. ఎన్నికల ద్వారా ప్రజల తీర్పును రాబట్టి రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచింది. దేశంలో ఉన్న పార్టీల మద్దతును లిఖిత పూర్వకంగా సాధించి, నాటి కాంగ్రెస్‌ప్రభుత్వానికి ఇచ్చింది. అయినా కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ఏర్పాటుకు ముందుకు రాకపోగా, తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యపరిచే అనైతిక కుట్రలకు పాల్పడింది.

కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులను, ఎం.పీ, ఎంఎల్ఏ, ఎంఎల్సీ పదవులను తృణప్రాయంగా వదులుకొని ఉద్యమ బాట పట్టిన టి ఆర్‌ఎస్‌అనేక పోరాట రూపాల ద్వారా తెలంగాణ ఆకాంక్షని లోకానికి చాటింది. చివరికి నేను నా ప్రాణాలను పణంగా పెట్టి ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్‌సచ్చుడో’ అని ఆమరణ నిరాహార దీక్షకు దిగవలసి వచ్చింది. యావత్‌తెలంగాణ నా నిరాహార దీక్షకు మద్దతుగా నిలిచి భూమ్యాకాశాలను ఒక్కటి చేసే విధంగా ఉద్యమిస్తే డిసెంబర్‌9 ప్రకటన వచ్చింది.
సమైక్య పాలకుల ఒత్తిడికి తలొగ్గి, చేసిన ప్రకటనపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్‌మరోసారి ఘోరమైన మోసం చేసింది. కాంగ్రెస్‌పార్టీ చేసిన మోసాల పర్యవసానంగా ఆవేశంతో వందలాదిమంది యువకులు ప్రాణ త్యాగాలకు పాల్పడ్డారు. ఇందుకు గాను, మీరు గానీ మీ పార్టీ గానీ ఏనాడూ పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు. తెలంగాణ ప్రజలను క్షమాపణలు వేడుకోలేదు. పైనుంచీ దయతో మేమే తెలంగాణ ఇచ్చామని ఆధిపత్య, అహంభావ ధోరణిని ప్రదర్శిస్తూ ఉద్యమాన్ని, అమరుల త్యాగాన్ని అవమానిస్తున్నారు. ఈ వైఖరి పూర్తిగా గర్హనీయం. ఈరకమైన వైఖరిని మార్చుకోనప్పుడు మీరు చేసే ఉత్సవాలకు సార్థకత ఏముంటుంది? ఇప్పటికైనా చారిత్రక సత్యాల వక్రీకరణ మాని చేసిన తప్పులకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి. రాజకీయ అవసరాల కోసం కాకుండా, మనస్ఫూర్తిగా కాంగ్రెస్‌తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పినప్పుడే, కొంతలో కొంత అయినా అది పాప పరిహారం చేసుకున్నట్టు అవుతుంది.

మీ పార్టీ పరిస్థితి అది అయితే ఇక మీ పరిస్థితి! తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మీరు మీ నోటినుండి ఇప్పటివరకూ జై తెలంగాణ అనే నినాదాన్ని పలక లేదు. తెలంగాణ ప్రజలకు ప్రాణ సమానమైన జై తెలంగాణ నినాదాన్ని నోటినిండా పలకలేని మీ మానసిక వైకల్యాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారు.ఇక ముందయినా తెలంగాణ వ్యతిరేక మానసికత నుంచి బయటపడి జై తెలంగాణ అని నినదించే వివేకాన్ని తెలంగాణ సమాజం మీనుంచి కోరుకుంటున్నది.మీరు ముఖ్యమంత్రయి ఆరు నెలలవుతున్నా ఇప్పటివరకూ తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని సందర్శించక, శ్రద్ధాంజలి ఘటించక తెలంగాణ మనోభావాలను తీవ్రంగా గాయ పరిచారు.. మీ ప్రవర్తన, మీ పార్టీ ప్రవర్తనతో స్పష్టమవుతున్నది ఒక్కటే. కాంగ్రెస్‌ఇప్పటికీ మారలేదు. ఇక మారదు. ఇక ముందు మారే అవకాశం లేదు. నాటికీ, నేటికీ ఎన్నటికీ కాంగ్రెస్‌కు తెలంగాణ ఒక రాజకీయ అవకాశమే తప్ప, మనఃపూర్వక ఆమోదం కాదు. తెలంగాణలో గత ఆరు నెలలుగా సాగుతున్న మీ పరిపాలనే ఇందుకు నిదర్శనం.

కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి పాలన కొనసాగుతున్న దాదాపు ఈ ఆరునెలల కాలంలో ప్రజా జీవితం అస్తవ్యస్తమై పోయింది. ముఖ్యంగా రైతాంగం పరిస్థితి మరీ దిగజారిపోయింది. సస్యశ్యామలమై, సుసంపన్నమైన తెలంగాణ బతుకు చిత్రాన్ని మీ అసమర్థ పాలన చిదిమివేసి, ఛిద్రం చేసింది. గత పదేండ్ల బి ఆర్ ఎస్ ప్రభుత్వ దార్శనికతతో శాశ్వతంగా దూరమైన కష్టాలు, సమస్యలన్నీ..మీ అసమర్థ పాలనతో ఆర్నెల్లలోనే తిరిగి ప్రత్యక్షమైతున్నయి. ఈ వింతను విషాదాన్ని సబ్బండ వర్గాల ప్రజలు విస్తుబోయి చూస్తున్నారు. ఇంతలోనే రాష్ట్రం ఇంత అధ్వానంగా ఎందుకు మారుతున్నదో అర్థంకాక తెలంగాణ సమాజం అయోమయానికీ ఆవేదనకు గురవుతున్నది.

బి ఆర్‌ఎస్‌పరిపాలనా కాలంలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకూ 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా జరిగింది. అత్యుత్తమ విద్యుత్తు సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశం దృష్టిని ఆకర్షించింది. కాంగ్రేస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి ఎన్టీపీసీ ద్వారా సుమారు 1400 మెగావాట్ల అదనపు విద్యుత్తు సమకూరింది. అయినప్పటికీమీ అసమర్థతో అప్రకటిత కరెంటు కోతలు విధిస్తూ మీరు రైతాంగం ఉసురుపోసుకుంటున్నారు.తొమ్మిది సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరాఘాటంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయగలిగిన వ్యవస్థ మీరు అధికారం లోకి రాగానే ఎందుకు సరిగ్గా పని చేయలేకపోతుందో అర్థం కాక నేను నా విస్మయాన్ని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ పరిణామం రాష్ట్ర ప్రతిష్టకు, ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారిందనేది నిర్వివాదాంశం.

మీరు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయకపోవటంతో లక్షలాది వ్యవసాయ మోటార్లు కాలిపోయినయి. చాలీచాలని కరెంటుతో లక్షల ఎకరాలు ఎండిపోయినయి, రైతన్నల గుండెలు బద్దలై పోయినయి . మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు, కరెంటు కోతలకు ఆకాల వర్షాలు తోడయ్యి పంటలు దెబ్బతినిపోయాయి. ఇందిరమ్మ రాజ్యమని గొప్పలు చెప్పిన మీరు ఒక్క రైతును కూడా పరామర్శించలేదు. వారికి భరోసా నిచ్చే చర్యలేవీ చేపట్టలేదు. ప్రపంచమే మెచ్చిన రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నది. అన్నదాతలు పంట పెట్టుబడి కోసం ఎవరి వద్దా చేయి చాచవలసిన పరిస్థితి ఉండకూడదనే ఉదాత్తమైన లక్ష్యంతో, మా హయాంలో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టినం. సమర్థవంతంగా అమలుచేసినం. ఆరు సంవత్సరాలలో 70 లక్షలమంది రైతులకు 73 వేల కోట్ల రూపాయలను పంట పెట్టుబడి సాయం కింద అందించినం. కరోనా ఉత్పాతం విరుచుకు పడి, రాష్ట్ర ఆదాయం దారుణంగా దెబ్బతిన్న దశలో సైతం మేము రైతులకు లోటు రానివ్వలేదు. అంత క్లిష్ట సమయంలో కూడా సకాలంలో రైతుబందు సహాయం అందించినం.

Also Read:చేతిలో జపమాలతో మోడీ!

మీరు అధికారం లోకి వచ్చిన తరువాత రైతుబంధు సహాయం సకాలంలో అందించడంలో దారుణంగా విఫలమయ్యారు.సరైన సమయంలో పంట పెట్టుబడి అందకపోవడంతో పాటూ, డిసెంబర్‌9 లోపు మీరు చేస్తామని చెప్పిన రుణమాఫీ చెయ్యక పోవడంతో రైతులకు అన్ని మార్గాలు మూసుకు పోయాయి. చివరికి ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీకి అప్పు చేయాల్సిన దుర్గతిలోకి రైతులు నెట్టబడ్డారు. మరో వైపు రైతు బంధు అడిగితె చెప్పుతో కొడుతామని మీ మంత్రివర్గ సహచరుడు దురహంకారంతో చేసిన వ్యాఖ్య విని యావత్‌తెలంగాణ కోపంతో ఉడికిపోయింది. మీరు సదరు మంత్రిని మందలించిన పాపాన కూడా పోలేదు. ఇప్పటికీ ఆ వ్యాఖ్యలు వెనుకకు తీసుకొని మీరు రైతులను మన్నింపు కోరలేదంటే రైతుల పట్ల మీ ప్రభుత్వానికి ఉన్న చులకనభావం స్పష్టమైతున్నది.

10 సంవత్సరాల బి ఆర్‌ఎస్‌పాలన రైతులను తలమీద పెట్టుకొని గౌరవిస్తే, ఆరు నెలల మీ పాలన రైతులను చెప్పుతో కొడతామని దారుణంగా అవమానించింది.మీరు “రైతు భరోసా” పథకం ద్వారా ఏటా 15,000 రూపాయల పంట పెట్టుబడి సహాయం అందిస్తామని, ఇది వందరోజుల్లోనే అమలులోకి తెస్తామని చెప్పి ఎన్నికల ప్రణాళికలో ప్రముఖంగా ప్రకటించారు. గద్దెనెక్కినంక మాట తప్పి రైతుల ఆశలను అడియాసలు చేసారు. ఇక నీటి పారుదల విషయానికి వస్తే గత పదేళ్ళలో స్వర్ణ యుగాన్ని అనుభవించిన రాష్ట్రాన్ని కృత్రిమ కరువు పాలు చేసారు. నదీ జలాలను ఎత్తిపోసే వ్యవస్థ అందుబాటులో ఉన్నా, ఆ పని చేయకుండా నీళ్ళు సముద్రం పాలవుతుంటే మీ క్షుద్ర రాజకీయ ప్రయోజనాల కోసం చోద్యం చూస్తూ కూర్చున్నారు. కేంద్రం ఎన్ని రకాలుగా మామీద ఒత్తిడి తెచ్చినా మేము ప్రాజెక్టుల మీద అధికారాన్ని బోర్దులకు అప్పగించడానికి అంగీకరించలేదు. మీరు సోయి దప్పిన తీరుగా కృష్ణా నది పై ఉన్న ప్రాజెక్టులను కె ఆర్ ఎంబీకి అప్పజేప్పేసారు. రాష్ట్ర ప్రయోజనాలను భంగపరిచారు. నదుల అనుసంధానం పేరుతో కేంద్రం లోని మోడీ ప్రభుత్వం గోదావరి జలాలను సైతం తరలించుకు పోయే ప్రణాళికలు తయారు చేస్తుంటే మీరు గుడ్లప్పగించీ చూస్తున్నారు. మీ చేతగానితనంతో రాష్ట్ర దీర్క్షకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయి. ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉన్నా సకాలంలో మీరు పొలాలకు వదలలేదు. దానివల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయేట్టు చేశారు.

బి ఆర్ ఎస్ హాయం లో రైతులకు ఎక్కడా చిన్న ఇబ్బంది కలగకుండా ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరచి, చివరి గింజ వరకూ కొనుగోలు చేసి రైతుల ప్రయోజనాలు కాపాడినం. కొద్దోగొప్పో పండిన పంటను అమ్ముకుందామని మార్కెట్‌యార్డులకు వచ్చిన రైతులకు అక్కడ కూడా అవస్థలేఎదురయితున్నాయి. కొనే నాథుడు లేక రోజులకొద్దీ రైతులు పడిగాపులుకాస్తున్నారనే వార్తలు కోకొల్లలు. రాష్ట్రం లో రైతులు ఎండలో పడిగాపులుపడి పంటకుప్పలపైనే ప్రాణం విడిచిన సంఘటనలు నా హృదయాన్ని మాత్రమే కాదు, యావత్ తెలంగాణ ప్రజల హృదయాలనూ తీవ్రంగా కలిచి వేసాయి. అన్ని పంటలకూ మద్దతు ధర మీద 500 రూపాయల బోనస్‌ఇస్తామన్న మీ హామీని మీరు నిలబెట్టుకోక పోవడం చూసిన రైతులు.. ఇంత దగానా?..ఇంత మోసమా.? అని ఆశ్చర్యపోతున్నారు, తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చావుకబురు చల్లగ చెప్పినట్లు సన్నవడ్లకే బోనస్‌ఇస్తామని మాట మారుస్తున్రు. మోసపూరితమైన మీ వైఖరిని రైతాంగం నిశితంగా గమనిస్తున్నదని మీరు తెలుసుకోవాలి. మేనిఫెస్టోలో చెప్పినదానికి కట్టుబడి అన్ని రకాల పంటలకూ విధిగా 500 రూపాయల బోనస్‌చెల్లించాలి.

గత పదేండ్లలలో బి ఆర్‌ఎస్‌ప్రభుత్వం సీజన్‌రావడానికి ముందే స్టాకు పెట్టుకొని విత్తనాలు ఎరువులు సకాలం లో సరఫరా చేసింది. మీ పరిపాలనలో పచ్చిరొట్ట కింద వేసుకునే విత్తనాలకోసం కూడా రైతులు లైన్లు కట్టాల్సిన అగత్యం సృష్టించారు. బ్లాకులో పత్తి విత్తనాల అమ్మకం జరుగుతున్నది అంటే అవినీతి ఎంతగా పెచ్చుమీరిందో అర్థం అవుతున్నది. గత పది సంవత్సరాల్లో తెరపినపడ్డ వ్యవసాయ రంగం తిరిగి సంక్షోభం వైపు ప్రయాణిస్తున్నది. మాయమైపోయిన బోరుబండ్లు మళ్ళా ఊరి దారి పట్టినాయి. రైతులు తమ కష్టార్జితాన్ని బోరుపొక్కల్లో ధారపోస్తున్నారు. ఎండిపోయిన పంటచేనును పశువుల మేతకు వదిలి రైతులు దీనంగా రోదిస్తున్న దృశ్యాలు చూసిన వారిని కన్నీరు పెట్టించాయి. బాయికాడ కరెంటు పెట్టబోయి షాకు తగిలి ప్రాణాలు పోగొట్టుకోవటం, పాముకాటుతో మరణించటం నిరాశ, నిస్పృహలతో అనేకమంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టటం చూసి గుండె తరుక్కుపోతున్నది. ఈ సంఘటనలు కాంగ్రెస్ పరిపాలనలో సమైక్య రాష్ట్రంలోని పరిస్థితులు పునరావృతం కావటం ఖాయమని సూచిస్తున్నాయి.

ఒక్క రైతులే కాదు , మీ పాలన తీరుతెన్నులతో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మేము పది సంవత్సరాలుగా చేనేత కార్మికులకు, మరమగ్గాల కార్మికులకు చేతి నిండా పని కల్పించాం. ఇటు వారి ఆత్మహత్యలను నివారించాం. అటు స్కూలు పిల్లలకు, పేద మహిళలకు నాణ్యమైన చేనేత వస్ర్తాలు అందించాం . మరి మీరు ? అధికారంలోకి రాగానే ఆ పద్ధతికి స్వస్తి పలికారు. కార్మికులు చేసిన పనికి రావాల్సిన పాత బకాయీలు కూడా మీ ప్రభుత్వం చెల్లించటం లేదు. ఉపాధిని కోల్పోయామనే రంధితో సిరిసిల్ల ప్రాంత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం చూసి తెలంగాణ సమాజం తల్లడిల్లిపోతున్నది.
ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ. 12,000 ఇస్తామని వాగ్దానం చేసారు. ఇప్పటివరకూ వారికి ఒక్కపైసా ఇవ్వక పోగా, మీ ముందు చూపు లేని నిర్ణయాల వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. మీ అనాలోచిత విధానాలతో వారి కడుపు మీద దెబ్బకొట్టారు. ఆలో లక్ష్మణా అని వారు అలమటిస్తుంటే మీరు ఆదరించి అక్కున చేర్చుకోవటం లేదు. వారికొక దారి చూపటం లేదు. దీంతో పలువురు ఆటో కార్మికులు బలవన్మరణాలకు పాల్పడటం మీ పాలన సృష్టించిన పెను విషాదం.అదే విధంగా రైతు కూలీలకు కూడా ఏడాదికి 12 000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు . వారికీ ఇప్పటివరకూ ఒక్క పైసా ఇవ్వలేదు. వారి పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. పొట్ట చేత పట్టుకొని వలస బాట పడుతున్న దృశ్యాలు తెలంగాణలో తిరిగి కనిపిస్తున్నాయి.
మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని ఆడబిడ్డలకు నెలకు రూ. 2500 రూపాయలు ఇస్తామని ఊదరగొట్టారు. రాష్ట్రం లోని మహిళలు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తక్షణమే అమలు చేస్తామని చెప్పిన హామీకి ఆరు నెలలౌతున్నా అతీగతీ లేదు. మహాలక్ష్మి పథకం మహామాయగా మిగిలిపోయిందని ప్రజలు భావిస్తున్నారు. అదే విధంగా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు, విద్యార్థులకు 5 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తామన్నారు. విద్యా సంవత్సరం మొదలవుతున్నా ఈ హామీల అమలు దిశగా ఒక్క అడుగు కూడా పడిన దాఖలా లేదు.

అమలులో ఉన్న ఫీజు రీఎంబరస్‌మెంట్‌పథానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదు. మీరు అధికారం లోకి వచ్చిన తరువాత బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విదేశాలలో చదువుకోసం ఇచ్చే 20 లక్షల ఓవర్సీస్‌స్కాలర్‌షిప్‌ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. ఈ పరిణామాలతో విద్యార్థి లోకంలో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. వృద్దులకూ తదితర అసహాయులైన ప్రజానీకానికి చెల్లించే ఆసరా ఫించన్లను 2016 రూపాయల నుంచి 4,000 కు పెంచి “చేయూత’’ పేరుతో అందిస్తామని మేనిఫెస్టోలో ఆర్భాటంగా ప్రకటించారు. హామీ ఇచ్చిన విధంగా ఇప్పటికీ పెంచకపోగా జనవరి నెలకు సంబంధించిన పించను నిస్సిగ్గుగా ఎగ్గొట్టినారు. ‘అన్నవస్ర్తాలకు పోతే ఉన్నవస్ర్తాలు ఊడిపోయిన’ చందంగా వారి పరిస్థితి మారింది. వృద్ధులూ తదితరులకు 4 వేలు, దివ్యాంగులకు 6 వేల రూపాయల చొప్పున అధికారం లోకి వచ్చిన తక్షణమే చెల్లిస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పిన్రు. పెంచిన చేయూత పింఛన్లు ఎప్పటి నుంచీ చెల్లిస్తారో ఇప్పటికీ మీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పటం లేదు.

దీన్నిబట్టి, మహాకవి శ్రీశ్రీ అన్నట్టు, ‘ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగా దగా” అనే కవితా వాక్యాలు మీ పాలనకు సరిగ్గా సరిపోతాయి.మీరు నిరుద్యోగులకు చూపిన ఆశలూ అన్నీ ఇన్నీ కావు. మొదటి క్యాబినెట్‌లోనే మెగా డి ఎస్‌సి ప్రకటిస్తామని అన్నారు. మెగా డి ఎస్‌సి ని, దగా డి ఎస్‌సి చేసారు. మేము ఇచ్చిన ఐదువేల పోస్టులకు సుమారుగా మరో ఐదువేలు కలిపి ఇదే మెగా డి ఎస్ సి పొమ్మన్నారు. అధికారం లోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు. ఆరు నెలలు గడుస్తున్నా ఆ దిశగా కనీస చర్యలు లేవు. 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పుడు అనలేదని మాట మారుస్తున్నారు. జాబ్‌క్యాలెండర్‌జాడే లేదు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. దానికి సంబంధించిన కార్యాచరణ ఏదీ మొదలు పెట్టలేదు. పోటీ పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగార్థులకు పరీక్ష ఫీజు వసూలు చేయమని ఎన్నికల ప్రణాళికలో చెప్పి, అధికారంలోకి రాగానే 400 రూపాయలున్న ఫీజును 2000 రూపాయలకు పెంచి నిరుద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు.

బి ఆర్‌ఎస్‌ప్రభుత్వం మిషన్‌భగీరథ పథకంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేసింది. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లాగా ఉన్న వ్యవస్థను సరిగ్గా నిర్వహించలేని కాంగ్రెస్‌ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రం లో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. గ్రామాల్లో పట్టణాల్లో జనం తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. నగర ప్రజలు మంచినీటి ట్యాంకర్ల కోసం లక్షలు ఖర్చు చేయవలసిన పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. మా పాలనలో ప్రజావైద్యాన్ని ఎంతగానో మెరుగు పరిచాం, ఆసుపత్రులను బలోపేతం చేసాము. నూతన హాస్పిటళ్ళను నిర్మించాం. అన్ని బెడ్లకూ ఆక్సీజన్‌సదుపాయం కల్పించాం. బస్తీ దవాఖానాలు, పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసాం. జిల్లాకో మెడికల్‌కాలేజీని తీసుకొచ్చాం. మీరు అధికారం పగ్గాలు చేపట్టిన నాటి నుండీ ప్రజావైద్యం దిగజారుతున్నది. డయాగ్నస్టిక్‌సెంటర్లు నిర్వీర్యమయ్యాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కరెంటు కోతల వల్ల అత్యవసర వైద్య సేవలకు విఘాతం కలుగుతున్నది. ఈ విషయం పై వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి. కొన్ని కొత్త మెడికల్‌కాలేజీలకు అనుమతులు తీసుకురావడం పై ప్రభుత్వం దృష్టి సారించిన పాపాన పోవటం లేదు.మేము నగరం నాలుగు వైపులా చేపట్టిన టిమ్స్‌ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్ లో మొదలుపెట్టిన భారీ ఆసుపత్రి నిర్మాణం వేగంగా సాగక కుంటుపడ్డది. వరంగల్ ఆసుపత్రి స్థాయిని కుదిస్తున్నారనే వార్తలు ప్రజలను నిరాశకు గురిచేస్తున్నాయి.

బి ఆర్ ఎస్ హయాం లో పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామీణ, పట్టణ పారిశుధ్య ప్రమాణాలు మెరుగుపడ్డాయి, ఆకుపచ్చదనం పెరిగింది, మౌలిక వసతులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పాలన షురువు కాగానే ప్రభుత్వంలో పట్టింపు లేదు. పర్యవేక్షణ లేదు. గ్రామాలు మళ్ళీ మురికి కూపాలవుతున్నాయి. పట్టణాలలో పారిశుధ్య నిర్వహణ అదుపు తప్పింది. హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్ళు పోసే దిక్కు లేకుండా పోయింది. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయక పోవడం ట్రాక్టర్ల డీజిల్ బకాయీలు చెల్లించక పోవటంతో చెట్లు వాడి పోతున్నాయి. కాంగ్రేస్ పాలనలో పరిశుభ్రతకూ, పచ్చదనానికి గ్రహణం పట్టిందని జనం వాపోతున్నారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకూ మూడు డి ఏ లు చెల్లిస్తామన్నారు. ఆ వాగ్దానమూ నెరవేర్చలేదు. ఆర్టీసి సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయింది.

ఇంకా మీరు అమలు చేస్తామని చెప్పిన వాగ్దానాల చిట్టా చాలా పెద్దది. కల్యాణలక్ష్మి షాదీ ముబారక్‌పథకం కింద ఇచ్చే లక్షా నూటపదహారు రూపాయలపై అదనంగా తులం బంగారం ఇస్తామని ప్రకటించారు. ఈ ఆరునెలల్లో లక్షల సంఖ్యలో పేదల పెళ్ళిళ్ళు జరిగాయి. ఏ ఒక్కరికీ తులం బంగారం ఇవ్వలేదు. అసలు ఇస్తారో ఇవ్వరోకూడా అర్థం కావటం లేదు. తులం బంగారం మాటేమోగానీ ఇవాల్సిన లక్ష రూపాయల చెక్కులు సైతం కొత్తగా ఎవరికీ ఇవ్వలేదు.రాష్ట్రంలో పారిశ్రామికరంగం కుదేలవుతున్నది. కరెంటు కోతలు రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. కొత్త పెట్టుబడులు రాకపోగా వచ్చినవి సైతం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఐటీ రంగంలోనూ అదే పరిస్థితి. ప్రజాపాలన పేరిట అధికారం లోకి వచ్చిన మీరు, మిమ్మల్ని ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రంలో బి ఆర్‌ఎస్‌కార్యకర్తలపై దాడులు నిత్యకృత్యంగా మారిపోయాయి. తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష కార్యకర్తలను హత్య చేసే దుష్ట సంస్కృతిని మీ పార్టీ తీసుకొస్తున్నది. సోషల్‌మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిర్బంధాలను ప్రయోగిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర అవతరణ దినోత్సవాల నిర్వహణపై మీ ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమైన బి ఆర్‌ఎస్‌ను ఆహ్వానించక పోవటం మీ అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనం. తెలంగాణ పోరాటంలో అన్నీ తానై నిలిచిన బి ఆర్‌ఎస్‌ను కావాలని విస్మరించి మీ సంకుచితత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు.

తెలంగాణకు గర్వకారణమైన అస్తిత్వ చిహ్నాలపై విషం కక్కుతూ అధికార ముద్ర నుంచి తొలగిస్తామని అవమానిస్తున్నారు. మీ వైఫల్య్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. వెయ్యి సంవత్సరాల కిందనే గొలుసు కట్టు చెరువుల వ్యవస్థను నిర్మించి తెలంగాణకు అన్నం పెట్టిన కాకతీయ రాజులను అవమానిస్తున్న మీ పాపానికి నిష్కృతి లేదు. ప్లేగు వ్యాధి మృతుల స్మృత్యర్థం కుతుబ్‌షాహీల కాలంలో నిర్మించిన హైదరాబాద్‌ఐకాన్‌, చార్మినార్‌కు మలినాన్ని ఆపాదిస్తూ తెలంగాణ ప్రజల, హైదరాబాద్‌ప్రేమికుల, మనోభావాల్ని దారుణంగా గాయపరుస్తున్న మీ సంకుచితత్వం తెలంగాణకు హానికరం, అవమానకరం. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి కోసం ఉద్దేశించిన స్థలంలో మీ పార్టీ పెద్దల విగ్రహాలను పెట్టే ప్రయత్నం ద్వారా కూడా మీరు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్నారు.

ఇక మీరు నన్ను దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించిన తీరు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి, 15 సంవత్సారాల పాటు ప్రజా పోరాటాన్ని నడిపించి, తెలంగాణ డిమాండుకు మద్దతుగా రాష్ట్రం లోని, దేశం లోని పార్టీల మద్దతు కూడగట్టి, స్వరాష్ట్ర సాధన కోసం కేంద్ర మంత్రి పదవినీ, ఎం పీ పదవినీ తృణప్రాయంగా వదిలివేసి, చివరికి ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఉద్యమాన్ని విజయ తీరం చేర్చిన నావంటి వాడిని మీరు ఆహ్వానించిన తీరు ఎంతో అవమానకరంగా ఉంది.

తెలంగాణ ప్రజా పోరాటానికి నాయకత్వ స్థానంలో నిలిచిన నాకు, వేదికపై స్థానం గానీ, రాష్ట్ర సాధనలో నాకున్న అనుభవాలు పంచుకోవడానికి ప్రసంగించే అవకాశం కాని కల్పించక పోవడం మీ అహంకార ఆధిపత్య ధోరణికి పరాకాష్ట . నన్ను ఆహ్వానించినట్టే ఆహ్వానించి, అవమాన పరచదలుచుకున్నమీ దురుద్దేశ్యాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. పోరాట వారసత్వాన్ని దెబ్బతీయడానికి మీరు చేస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉత్సవాలు జరగుతున్న తీరును ఉద్యమకారులు ఇప్పటికే నిరసిస్తున్నారు. రానున్న కష్టాలను తలచుకుని తెలంగాణ తల్లి తల్లడిల్లుతున్నది . ప్రతి క్షణం తెలంగాణ గుండె గాయపడుతున్నది.

ఒకవైపు పంటలు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల ఆక్రోశం, పని కోల్పోయినందుకు ప్రాణాలు తీసుకుంటున్న చేనేత కార్మికుల దుఃఖం, ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ల ఆవేదన, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ తల్లడిల్లుతున్న నిరుద్యోగుల్లో ఆవరించిన నిస్తేజం, తాగే నీళ్ళకోసం తండ్లాడుతున్న తల్లుల ఆయాసం, కరెంటు కోతలతో మసక బారుతున్న రాష్ట్ర ప్రతిష్ట, కుంటు పడుతున్న పారిశ్రామిక ఐటీ రంగాల ప్రగతి, ఒకటని కాదు, అన్ని రంగాలు అరునెలల్లోనే ఆగమైపోయిన విషాదం . తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్విగ్న, ఉత్తేజ కరమైన సందర్భమే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో …ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని బిఆర్ఎస్ పార్టీతో సహా ఉద్యమకారులు, తెలంగాణ వాదుల అభిప్రాయంగా వుంది. అందువల్ల… పైన పేర్కొన్న కారణాల రీత్యా, ప్రజాజీవితాన్ని క్రమ క్రమంగా కల్లోలంలోకి నెట్టుతున్న మీ పాలననూ.. మిమ్మల్ని ప్రశ్నించేవాళ్లను అడుగడుగునా అవమానిస్తూ దాడులు చేస్తున్న మీ వైఖరినీ, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న మీ వికృత పోకడలనూ నిరసిస్తూ.. మీరు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలలో బి ఆర్‌ఎస్‌పార్టీ పాల్గొనబోవటం లేదని తెలియ జేయటానికి విచారిస్తున్నాను. ఇక ముందైనా ఇటువంటి వైఖరి మానుకొని నిజమైన ప్రగతి కోసం సంక్షేమం కోసం మీరు ప్రయత్నిస్తారనీ , ఎన్నికల వాగ్దానాలన్నీ త్వరలోనే నెరవేరుస్తారనీ ప్రజల మన్ననలు పొందుతారని ఆశిస్తున్నాను. జై తెలంగాణ! జై భారత్!! అని తెలిపారు కేసీఆర్.

- Advertisement -