ఉద్యమంలా గ్రామవికాసం:సీఎం కేసీఆర్

242
kcr
- Advertisement -

నూతనంగా ఎన్నికయ్యే సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు ఫిబ్రవరి నుంచి మే వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దే విషయంలో వారికి సంపూర్ణ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ప్రగతిభవన్‌లో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే అంశంపై శుక్రవారం సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచడం లక్ష్యంగా రూపొందించిన చట్టంపై అవగాహన కోసం.. ప్రతి గ్రామ పంచాయతీకి కొత్త చట్టం తెలుగుప్రతులను పంపించాలని సూచించారు. కొత్తగా నియామకమయ్యే పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కొత్తగా ఎన్నికయ్యే సర్పంచ్‌లు మూస పద్ధతిలో కాకుండా.. గ్రామాల సమగ్ర వికాసానికి పాటుపడే ఉద్యమకారులుగా మారాలని ఆకాంక్షించారు.

kcr panchayatraj

రాష్ట్రంలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామానికీ ఒక కార్యదర్శి ఉండేలా పంచాయతీ కార్యదర్శుల నియామకం కూడా జరుగుతున్నది. గ్రామాభివృద్ధిలో వీరిద్దరి పాత్ర చాలా కీలకం. గ్రామ పంచాయతీకి విధులు, బాధ్యతలు అప్పగించే విషయంలో కొంత జాప్యం అనివార్యమవుతున్నది. కేంద్రప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్‌కు పోయే అవకాశం ఉన్నందున.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్‌కే పోతుంది. ఏప్రిల్, మే నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఆ తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతాం. అప్పుడే పంచాయతీలకు నిధులు కేటాయించడం సాధ్యమవుతుంది. ఆలోగా సర్పంచులు, కార్యదర్శులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి, గ్రామాభివృద్ధి కోసం పాటుపడే కార్యకర్తలుగా తీర్చిదిద్దాలి. తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ, ఆస్కి, ఎంసీఆర్‌హెచ్చార్డీ తదితర సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించాలి అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, కాలె యాదయ్య, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -