దేశరాజకీయాల్లో గుణాత్మాక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్,బీజేపీలకు వ్యతిరేకంగా బలమైన కూటమిని నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. జాతీయ స్ధాయిలో,సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలో తన ఆలోచనలు కార్యరూపం దాల్చేలా అడుగులు వేస్తున్నారు కేసీఆర్. జాతీయ స్థాయిలోని వివిధ సంస్థలు, సంఘాలు, వ్యక్తులతో సమావేశం కానున్నారు. ఇందుకోసం జాబితాను సిద్దం చేశారు. దశల వారిగా అన్నివర్గాల వారిని కలుసుకునేందుకు వ్యుహం సిద్దం చేశారు.
ముందుగా కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన రిటైర్ట్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ అధికారులతో భేటీ కానున్నారు. తర్వాత.. న్యాయవాదులు, రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు, వైమానిక శాఖల్లో పనిచేసిన విశ్రాంత అధికారులు, ఆర్థిక వేత్తలు, మీడియా సంస్థలు, పాత్రికేయులు, పారిశ్రామిక, కార్మిక సంస్థలతో భేటీ కానున్నారు.
ఇందుకోసం హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాలైన న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు లాంటి నగరాల్లో సమావేశాలు ఏర్పాటుచేయనున్నారు. ఈ సమావేశాల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు వష్యకత, 70 ఏళ్లలో దేశాభివృద్ధి, కాంగ్రెస్ – బీజేపీ విధానాలు, దేశంలో రావాల్సిన మార్పులను వివరించనున్నారు. ఇందుకోసం అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు.
మొత్తంగా ఇప్పటికే జాతీయస్ధాయిలో మమతా బెనర్జీతో సహా పలువురు మద్దతివ్వగా రానున్న రోజుల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రక్రియకు మరింత వేగంగా అడుగుల పడే అవకాశం ఉంది.