కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
బస్సు ప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 20 మందికి పైగా దుర్మరణం చెందటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
బస్సు ప్రమాదం పట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
కర్నూల్ బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు…
తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలకు ఆదేశించాం… ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో టెలిఫోన్ లో మాట్లాడాం అన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం… త్వరలో ఆంధ్ర ప్రదేశ్ ,కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులు, రవాణా శాఖ కమిషనర్లు సమావేశమవుతాం… క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరాం అన్నారు.
Also Read:కర్నూల్‌లో ఘోర ప్రమాదం.. బస్సు దగ్ధం

