సింగరేణి కార్మికులకు సీఎం… దసరా కానుక

751
cm kcr singareni
- Advertisement -

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక అందజేశారు. ఈ ఏడాది సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా 28 శాతం ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనిద్వారా ప్రతీ కార్మికుడిగా లక్షా 899 రూపాయల బోనస్ అందనుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి చాలా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సంస్థాగతంలో బలోపేతమైందని, అందులో పనిచేస్తున్న వారందరూ బాధ్యతతో పనిచేస్తుండడంతో రికార్డు స్థాయి ఉత్పత్తి జరుగుతోందన్నారు. 2018-19లో బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో 64.14 మిలియన్ టన్నులకు చేరుకుందన్నారు.

2013-14లో సింగరేణి సంస్థ రూ. 418 కోట్ల లాభం గడించింది. గత ఐదేళ్లలో ఇది ప్రతీ ఏటా పెరుగుతూ 2018-19 నాటికి రూ. 1765 కోట్ల లాభాన్ని సింగరేణి సంస్థ సాధించగలిగింది. ఉత్పత్తి, రవాణా, అమ్మకం, లాభాలు, టర్నోవర్‌లో సింగరేణి సాధిస్తున్న ప్రగతి తెలంగాణ ప్రభుత్వ పాలనకు ప్రతీకగా నిలుస్తున్నది. కోల్‌ ఇండియాతో పోల్చితే సింగరేణి ఎంతో మెరుగ్గా ఉండటం మనందరికి కూడా గర్వకారణం. సమైక్య పాలనలోని చివరి సంవత్సరమైన 2013-14 సంవత్సరంలో కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 13,554 చొప్పున బోనస్‌ చెల్లించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో కార్మికులకు ఇచ్చే బోనస్‌కు క్రమంగా పెంచుతూ వస్తుంది. 2017-18లో లాభాల్లో 27 శాతం వాటాగా ఒక్కొక్క కార్మికుడికి రూ.60,369 ను చెల్లించింది. ఈసారి లాభాల్లో వాటాను మరో శాతానికి అంటే 28 శాతానికి పెంచుతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాం. లాభాల్లో వాటా పెంచడం వల్ల ఒక్కో కార్మికుడికి రూ.1,00899 బోనస్‌గా అందుతుంది. గతేడాది కన్నా రూ.40,530 అదనంగా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అందిస్తున్న కానుక అని సీఎం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని కార్మికులు, సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేసి మరిన్ని లాభాలు, విజయాలు సాధించిపెట్టాలని ప్రగాడంగా ఆశిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -