బీజేపీ ఎంపీ తేజస్వి వెధవ..కేసీఆర్ ఫైర్

6
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పార్టీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేసిన అడ్డగోలు వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలంగాణ పౌరుషం గల గడ్డ. అలాంటి గడ్డను అవమానిస్తుంటే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారు? వారికి ఆత్మగౌరవం లేదా? అని ప్రశ్నించారు. ఒకవేళ బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉండి ఉంటే, తేజస్వి సూర్యతో క్షమాపణ చెప్పించేవారమని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను ఆయన చేతకానితనంగా అభివర్ణించారు.ఒకప్పుడు తెలంగాణను వ్యవసాయం, అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెడితే.. ప్రస్తుత ప్రభుత్వం కేవలం భూముల కబ్జాలు, కూల్చివేతల్లోనే నెంబర్ వన్ గా నిలిచిందని ఎద్దేవా చేశారు.ధాన్యం కొనుగోలు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం, మంత్రుల భాషపై స్పందిస్తూ, వారి చిల్లర మాటలు చూస్తే జాలి వేస్తోందని ఘాటుగా విమర్శించారు.

రాష్ట్ర స్థాయి కమిటీ మినహా.. మిగిలిన అన్ని స్థాయిల కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. కొత్త కమిటీల నియామకం, వారికి శిక్షణా తరగతుల నిర్వహణ బాధ్యతలను కేటీఆర్ పర్యవేక్షిస్తారు.పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. కేవలం బుక్ ద్వారానే కాకుండా, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పద్ధతుల్లో కూడా సభ్యత్వాలను నమోదు చేయాలని సూచించారు.

జీవన్ రెడ్డిని పార్టీ జనరల్ సెక్రటరీగా నియమిస్తున్నట్లు ప్రకటించి, కార్యవర్గానికి పరిచయం చేశారు.త్వరలోనే అన్ని స్థాయిలలోనూ కొత్త కమిటీలను నియమించి, పార్టీ శ్రేణులను మరింత సమాయత్తం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఉద్యమ స్ఫూర్తితో మళ్లీ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన దిశానిర్దేశం చేశారు.

- Advertisement -