ప్రాంతీయ పార్టీలతోనే దేశంలో గుణాత్మకమైన మార్పు వస్తుందని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రజల మంచి, భవిష్యత్తు కోసం రాజకీయాలపై సీఎం కేసీఆర్‌తో చర్చలు జరిగాయని తెలిపారు. గుణాత్మక మార్పు కోసం భావసారూప్యత కలిగిన నాయకులంతా ఏకం కావాలన్నారు.
ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు, వ్యవసాయ విధానాలపై చర్చించామని ..తెలంగాణ సంక్షేమ పథకాల్లో చాలా మంచి విషయాలున్నాయని తెలిపారు.
దేశంలో బీజేపీ,కాంగ్రెసేతర ప్రత్యామ్నాయం కావాలన్నారు సీఎం కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో ఆరంభం మాత్రమేనని దేశంలోని మిగతా నేతలతోనూ చర్చలు జరుపుతామని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు మద్దతుంటుందని..ఒడిశాలో రైతుబంధు తరహా పథకం అమలు సంతోషదాయకం అన్నారు. నవీన్ పట్నాయక్ దేశంలో సీనియర్ నాయకుడు.. అందరికీ ఆదర్శప్రాయుడని వెల్లడించారు. సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్,శేరి సుభాష్ రెడ్డి ఉన్నారు.