ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (శనివారం) ఢిల్లీలో కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీని మర్యాద పూర్వకంగా కలిశారు. రక్షణ శాఖ భూముల అప్పగింత, జీఎస్టీ అంశాలపై చర్చించారు. ఈ రెండు అంశాల్లో తెలంగాణ రాష్ట్రం చేసిన వినతుల పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని జైట్లీ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన కొత్త సచివాలయం కోసం బైసన్ పోలో గ్రౌండ్స్, మేడ్చల్ రహదారిని, కరీంనగర్ రహదారిని విస్తరించడానికి కావాల్సిన స్థలాలను అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా జైట్లీ సీఎం కేసీఆర్ కు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే చేసిన విజ్ఞప్తిని అన్ని కోణాల్లో పరిశీలించి స్థలాలను అప్పగించాలని నిర్ణయించామన్నారు. మిషన్ భగీరథ, నీటిపారుదల, గృహ నిర్మాణం, రహదారులు తదితర ప్రజోపయోగ నిర్మాణాలపై విధించే జీఎస్టీ తగ్గించాలనే అంశంపై కూడా సెప్టెంబర్ 9 న హైదరాబాద్ లో జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అరుణ్ జైట్లీ తెలిపారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకే నిర్మాణ పనులపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించామని జైట్లీ తెలిపారు. 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే విషయంలో కూడా తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
రక్షణ శాఖ భూముల అప్పగింత, జీఎస్టీ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినందుకు అరుణ్ జైట్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, రహదారుల విస్తరణ ఆవశ్యకతను కేంద్రం గుర్తించిందన్నారు. జీఎస్టీపై హైదరాబాద్ లో జరిగే సమావేశంలో సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు కూడా అరుణ్‌జైట్లీని కలిశారు.