ప్రతి నియోజకవర్గంలో కేసీఆర్‌ ప్రచారం..

268
- Advertisement -

టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మారుమూల గ్రామాల్లో సైతం విస్తృతంగా పర్యటిస్తున్నారు. నాలుగున్నరేండ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన ప్రజోపయోగ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మళ్లీ ఆశీర్వదించండి.. అండగా ఉంటాం.. మరింత అభివృద్ధి చేసి చూపిస్తాం అంటూ ఓటర్లను కోరుతున్నారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో సభలు నిర్వహిస్తూ టీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతుంది. అయితే తెలంగాణలో గత శనివారం ఎన్నికల షెడ్యూలు విడుదలవడంతో దీనికి అనుగుణంగా ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

CM KCR

ఇప్పటికే ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాలుగు నియోజకవర్గ కేంద్రాలు మినహాయించి, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆయన భావిస్తున్నారు. రోజుకు రెండు, మూడు సభలతో ముందుకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ స్వయంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. 50 రోజుల వ్యవధిలో 115 నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం కేసీఆర్‌ గత నెల 7న హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నిజామాబాద్‌, నల్గొండ, వనపర్తిల్లో ఎన్నికల సభల్లో పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఎన్నికలకు మరో రెండు నెలల సమయం ఉంది. బతుకమ్మ, దసరా, దీపావళి పర్వదినాలు పోనూ మిగిలిన రోజుల్లో ప్రచారం నిర్వహించాలని సీఎం ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. దీనిపై కేసీఆర్‌ రెండు రోజులుగా పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ప్రచారానికి ఎప్పుడు రావాలని వారి అభిప్రాయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రచార షెడ్యూలును వారం రోజుల్లో ఖరారు చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -