మెదక్ సమీకృత కార్యాలయాలకు సీఎం శంకుస్థాపన

271
kcr medak
- Advertisement -

మెదక్ జిల్లా కలెక్టరేట్,ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. మెదక్ జిల్లా ఏర్పాటుతో 70 ఏండ్ల కలను నిజం చేసిన కేసీఆర్ జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా మెదక్ కు చేరుకున్నారు. హవేలిఘనపూర్ మండలం ఔరాంగాబాద్ శివారులో నూతన సమీకృత కార్యాలయాల భవన సముదాయాలకు శంకుస్థాపన చేశారు. తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రికి జిల్లా ప్రజలు భారీగా స్వాగతం పలికారు. సీఎం వెంట భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు,ఉన్నతాధికారులు ఉన్నారు.

అనంతరం సీఎం కేసీఆర్ కరీంనగర్‌ బయలుదేరనున్నారు. కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లిలోని తన నివాసానికి చేరుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొంటారు. రాత్రి 7.30 గంటలకు స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో జరుగుతున్న తన మేనకోడలు చంద్రమతి కొడుకు పెండ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు.

రేపు ఉదయం 10.30 గంటలకు హుజూరాబాద్ మండలం ఇందిరానగర్ చేరుకొని దేశ వ్యవసాయ చరిత్రలో సరికొత్త అధ్యయాన్ని సృష్టించబోతున్న రైతుబంధు పథకాన్ని ప్రారంభిస్తారు. కరీంనగర్ తీగలగుట్టపల్లి నుంచి హుజూరాబాద్‌కు వెళ్లే మార్గంలో అక్కడక్కడా ఆగి సీఎం కేసీఆర్ రైతులతో మాట్లాడతారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

- Advertisement -