రెండు రోజుల పాటు జరిగిన సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన సూచనలు అనుసరించి యాదాద్రి టెంపుల్ సిటి నిర్మాణ ప్రతిపాదనలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. యాదాద్రి టెంపుల్ సిటి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. యాదాద్రి అభివృద్ధి పనులపై సోమవారం ఎనిమిది గంటలపాటు జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి మాస్టర్ ప్లాన్ కు సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రధాన గుట్టకు సమీపంలోని 75 ఎకరాల స్థలంలో అత్యవసర, ముఖ్యమైనే సేవలందించే విభాగాలుండాలని చెప్పారు.
ఇందులో 30 ఎకరాల్లో కార్ల పార్కింగ్, 10 ఎకరాల్లో బస్సుల పార్కింగ్, 35 ఎకరాల్లో బస్ డిపో, పోలీస్, పైర్, కమర్షియల్ కాంప్లెక్స్, పుడ్ కోర్టు రావాలని చెప్పారు. ఆలయం సమీపంలోని మరో ప్రాంతంలోని 25 ఎకరాల్లో పూలతోట, 50 ఎకరాలలో కళ్యాణ మంటపం, ప్రవచన వేదిక నిర్మించాలని సిఎం క్రేసీఆర్ చెప్పారు. గుట్టపై నుంచి కిందికి డ్రైనేజి వ్యవస్థ,వ్యర్థ పదార్థాల విసర్జన కోసం ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించాలని సూచించారు. దర్శనం సజావుగా, ఖచ్చితమైన వేళలకు జరిగే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాఫ్ట్ వేర్ రూపొందించాలని చెప్పారు. టెంపుల్ సిటీలో భక్తులకు మంచి వసతి కల్పించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, 100 ఎసి రూములు, 100 నాన్ ఎసి రూములు, 100 ఉచిత రూములు, డార్మెటరీ ఏర్పాటు చేయాలని కోరారు.
యాదాద్రిలో కాటేజీల నిర్మాణం కోసం అనేకమంది దాతలు ముందుకు వస్తున్నారని, దానికోసం కూడా పత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. దాతల కాటేజీల్లో కూడా ఏకరూపత ఉండే విధంగా వైటిడిఏ ఆధ్వర్యంలోనే ఐదు కేటగిరీలుగా వాటిని విభజించి నిర్మించాలని చెప్పారు. ఐదు లక్షలు, పది లక్షలు, ఇరవై ఐదు లక్షలు, యాబై లక్షలు, కోటి రూపాయల విలువైన కాటేజీలు నిర్మించాలని, ముందుకొచ్చిన దాతల నుంచి ఆ డబ్బులు తీసుకుని వారి పేరు మీద వైటిడిఏ నిర్వహించాలని సిఎం చెప్పారు. ప్రధాన గుట్టపైనే దాదాపు 2000 కార్లు పార్కు చేసే విధంగా మల్టి లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
కార్ల పార్కింగ్ స్థలం నుంచి గుట్టపైకి చేరుకోవడానికి ఎస్కలేటర్స్ ఏర్పాటు చేయాలని సిఎం కోరారు. యాదాద్రిలో అతి పెద్ద హనుమంతుడి విగ్రహం ప్రతిష్టించాలని నిర్ణయించిన నేపధ్యంలో విగ్రహం ఎలా ఉండాలి? ఎంత ఎత్తు ఉండాలి? ఏ లోహంతో చేయాలి? తదితర అంశాలను పరిశీలించేందుకు అదికారుల బృందం చైనా వెళ్లి అక్కడ రూపుదిద్దుకుంటున్న భారీ విగ్రహాలను సందర్శించి, అధ్యయనం చేయూలని చెప్పారు. ముఖ్యమంత్రి చేసిన సూచనలకు అనుగుణంగా దేవాదాయ, ఆర్ అండ్ బి, రెవెన్యూ అటవీ అదికారులు, ఆలయ శిల్పులు మంగళవారం రంగంలోకి దిగి ప్రతిపాదిత స్థలాలను సందర్శించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కె. భూపాల్ రెడ్డి మంగళవారం సంబంధిత అధికారులతో మాట్లాడి సమన్వయం చేశారు.