తెలంగాణకు ‘పచ్చ’లహారాన్ని తొడగాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా మరో అంకానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా సీఎం కె. చంద్రశేఖర్ రావు కరీంనగర్‌లో లోయర్ మానేరు డ్యామ్ వద్ద మహోగని అనే ఔషధ మొక్కను నాటి హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 24 శాతంగా ఉన్న అడవుల శాతాన్ని 33శాతం పెంపు లక్ష్యంగా ప్రారంభమైన హరితహారం తొలి రెండు విడుతల్లో దాదాపు 48 కోట్ల మొక్కలను నాటారు. ఈసారి లక్ష్యాన్ని పెంచి కనీసం 40 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ విడుతలో పెద్ద ఎత్తున ప్రజలను కదిలించి వారి భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు. మొక్కలు నాటడంతోపాటు ఏడాది పొడవునా వాటిని సంరక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ బ్రిగేడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మొక్కల సంరక్షణకు కృషిచేసిన వారికి హరితమిత్ర అవార్డులతో పాటు రూ. లక్షనుంచి రూ. 15 లక్షల చొప్పున సుమారు రూ.15 కోట్ల విలువచేసే నగదు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించారు.