టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా.. గులాబి కండువా కప్పుకుంటున్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆర్యవైశ్య కమ్యూనిటీ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాతో పాటు పలువురు ఆర్యవైశ్యులు గులాబి తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి కేటీఆర్ వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ కు వైశ్యుల మీద ప్రత్యేక అభిమానం ఉందని.. కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఉప్పల తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ఆర్యవైశ్య కమ్యూనిటీలోని పేదల కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీలో సొంత ఇంటి ఓట్లు పడనివారు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులేనని.. ఉత్తమ్ కుమార్ వి ఉత్తుత్తి మాటలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చనిపోయిన వారి వేలిముద్రలతో కాళేశ్వరంపై కేసు వేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాకోర్టులోనే తేల్చుకునేందుకు తాము ఎన్నికలకు వెళ్తున్నామని.. రాబోయే తరాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని… ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలాగా టీఆర్ఎస్ తప్పుడు హామీలు ఇవ్వదని.. ఎన్నికల కోసం కాంగ్రెస్ ఆచరణసాధ్యం కాని హామీలు ఇస్తోందన్నారు. గురుకులాల ద్వారా 3 లక్షల మంది విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు.