దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నేరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. కరీనంగర్‌లో మీడియాతో మాట్లాడిన పవన్..తెలంగాణ సాధించిన కేసీఆర్‌కే ప్రజలు పట్టం కట్టారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ బాగా కష్టపడుతున్నారని..ఆయన స్మార్ట్ సీఎం అని ప్రశంసలు గుప్పించారు. రాష్ట్రాన్ని సమర్ధవంతంగా అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిస్తే తప్పేంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. నూతన సంవత్సరం రోజున కేసీఆర్ ని కలిసి శుభాకాంక్షలు చెబితే ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారని అన్నారు.
కాగా, ప్రజా సమస్యలపై ఎలా పడితే అలా తాను మాట్లాడలేనని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలపై విమర్శలు చేయడం కోసం తాను పని చేయనని, ప్రజా సమస్యలను అర్థం చేసుకుని, వాటిని ప్రభుత్వాల దగ్గరకు తీసుకువెళ్లి ఆ సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. విమర్శలు చేస్తూ రాజకీయాలను అస్థిరపర్చే ఉద్దేశం తనకు లేదని అన్నారు.