ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది వేడుకుల ప్రారంభోత్సవానికి రావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈమేరకు సోమవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌తో ఆయన సమావేశమయ్యారు.
ఏప్రిల్ 26 నుంచి 3 రోజులపాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నామని రాష్ట్రపతికి తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ రాష్ట్రపతికి ఓయూ చరిత్ర గురించి వివరించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సహా ఎందరో ప్రముఖులు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారని తెలిపారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు వచ్చేందుకు ప్రణబ్ అంగీకరించారు.
ఇక రాష్ట్రంలోని రాజకీయ, పరిపాలన సంబంధిత అంశాలను రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ వివరించారు. ఈ ఏడాది 19.5 శాతం వృద్ధిరేటును సాధించామని తెలిపారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి జరగదనే అపోహ ఉండేదని, తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా చిన్నరాష్ట్రాలతో ఆర్థికంగా నష్టం జరుగుతుందన్నారని, అయితే ఇవన్నీ తప్పని నిరూపించామని సీఎం కేసీఆర్ అన్నట్లు సమాచారం. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందనేందుకు తెలంగాణ రాష్ట్రమే నిదర్శనం అని సీఎం పేర్కొన్నట్లు సమాచారం.
రాష్ట్రపతిని కలిసిన వారిలో డిప్యుటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, వినోద్ కుమార్, సీతారాం నాయక్, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి ఉన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం కడియం విలేకరులతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 26 నుంచి 3రోజుల పాటు ఓయూ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, దేశంలో ఉన్న పురాతన వర్సిటీల్లో ఓయూ 7వ స్థానంలో ఉందన్నారు. ఆ వర్సిటీలో చదివిన ఎంతో మంది జాతీయ నాయకులుగా ఎదిగారని, ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పని చేస్తున్నారని పేర్కొన్నారు.