సీఎం కేసీఆర్ … ‘మన్‌ కీ బాత్‌’

207
- Advertisement -

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తాను అధికారం చేప‌ట్టాక… ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యేందుకు వారికి ప్ర‌భుత్వ సంక్షేమ ఫ‌థ‌కాలు వివ‌రించేందుకు నెల‌కోసారి రేడియోద్వారా మ‌న్‌కీబాత్(మనసులో మాట) అనే కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. ఈ ప్రోగ్రాం స‌క్సెస్ కావ‌డంతో ఇప్పుడు ఇదేబాటలో సీఎం కేసీఆర్ పయనించనున్నారు. ఓ వైపు సాంకేతికతను వినియోగించుకోవడంతో పాటు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు  రేడియో లాంటి ప్ర‌సార సాధ‌న‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌నుకుంటున్నారు. ప్ర‌భుత్వ ప‌నితీరు ఎలాగుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు.

భారీ బహిరంగ సభల కంటే ఎంపిక చేసిన వర్గాలతో ముఖాముఖి మాట్లాడటం ద్వారానే ప్రభుత్వ పనితీరును ప్రజలకు బాగా వివరించవచ్చన్న అభిప్రాయానికి సీఎం వచ్చినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో సత్ఫలితాన్నిచ్చిన ‘ఈ–క్యాంపెయిన్‌’ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.

Kcr In Mann Ki Baat

కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా.. నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోనున్నారని చెబుతున్నారు. ఇకపై ప్రగతి భవన్‌ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల ప్రజలు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, ఆశ వర్కర్లు, అంగన్‌ వాడీ వర్కర్లు వంటి వారితో వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో నేరుగా మాట్లాడబోతున్నారు. ముందుగానే ఎంపిక చేసిన జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో వివిధ వర్గాలవారిని సమీకరిస్తారు. హైదరాబాద్‌ నుంచి సీఎం నేరుగా లైవ్‌లో వారినుద్దేశించి ప్రసంగిస్తారు.

ఇందుకోసం ఎల్ఈడీ స్క్రీన్‌ల‌ను వినియోగిస్తారు. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోని ప్రజలు సీఎం ప్రసంగాన్ని చూసేలా భారీ స్థాయిలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.  అంతేకాదు ప్ర‌జ‌లు కూడా సీఎంతో లైవ్‌లో మాట్లాడి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకోవ‌చ్చ‌ని అధికారులు తెలిపారు. వీలైతే కేసీఆర్ అక్క‌డిక‌క్క‌డే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తార‌ని సీఎం క్యాంప్ ఆఫీస్ చెబుతోంది. ఇప్పటికే పలు దఫాలుగా వివిధ వర్గాల ప్రజలను ప్రగతి భవన్‌కు రప్పించి సీఎం నేరుగా మాట్లాడారు. దీనికంటే ‘ఈ–పబ్లిసిటీ’ద్వారా ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

- Advertisement -