కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై టీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో చర్చించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీమహబూబ్ నగర్ జిల్లా టిఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. జిల్లా పునర్విభజనపై వారితో చర్చించారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుపై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరణ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని వారి నుంచి అడిగి తెలుసుకున్నారు.
కాగా పాలనావిధానంలో పెను మార్పులు తీసుకువచ్చేందుకు చేపడుతున్న జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం ప్రజాభిప్రాయానికి అద్దం పట్టేలా ఉండాలని సీఎం అభిలషిస్తున్నారు. రాజకీయ డిమాండ్లకు అనుగుణంగా కాకుండా ప్రజలు కోరుకున్నట్టుగా కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఉండాలన్నది ముఖ్యమంత్రి అభిప్రాయం. ఈ దిశగా క్షేత్రస్థాయిలోని నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవాలని సీఎం నిశ్చయించారు.