తిత్లీ తుపాను ప్రభావంపై సీఎం కేసీఆర్ సమీక్ష

239
- Advertisement -

దేశవ్యాప్తంగా తిత్లీ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మద్య విద్యుత్తు సరఫరా కారిడార్ దెబ్బతిన్నది. తాల్చేరు-కోలార్, అంగూర్- శ్రీకాకుళం లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో తిత్లీ తుపాను ప్రభావంపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తిత్లీ ప్రభావంతో ఉత్తరాది నుంచి తెలంగాణకు రావాల్సిన ౩వేల మెగావాట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 10,500 మెగావాట్లు కాగా.. ఆ మేరకు సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తుపాను తర్వాత రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా తీరుపై సీఎం కేసీఆర్, జెన్ కో సీఎండీ ప్రభాకరరావుతో సమీక్ష నిర్వహించారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే విద్యుత్ పూర్తిగా ఆగిపోయిందని.. బహిరంగ మార్కెట్‌లో కొనుగోళ్లు కూడా నిలిచిపోయాయని సీఎంకు ప్రభాకర్ రావు వివరించారు.

దెబ్బతిన్న విద్యుత్ లైన్ల పునరుద్దరణకు కనీసం మూడు రోజులు పట్టే అవకాశం ఉందని సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. దీంతో రాష్ట్రంలో మూడువేల మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడనుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కునేందుకు థర్మల్, హైడల్ పవర్ స్టేషన్లలో పూర్తిస్థాయి సామథ్యం మేరకు ఉత్పత్తి చేస్తున్న చెప్పారు.

రానున్న రెండు,మూడు రోజులపాటు విద్యుత్ సరఫరాలో కొంత ఇబ్బంది ఏర్పడే సూచనలు ఉన్నాయని సీఎంకు ప్రభాకరరావు చెప్పారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా.. దక్షిణాదిలో విద్యుత్ ఇబ్బందులు నెలకొనే పరిస్థితులు ఎదురుకానున్నట్లు వివరించారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడిన పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొవాలని ఈ సందర్బంగా ప్రభాకరరావుకు సీఎం కేసీఆర్ సూచించారు.

- Advertisement -