కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడికి తెలంగాణ ముఖ్యమంత్రి మొక్కులు తీర్చుకున్నారు. ఇవాళ ఉదయం వరాహస్వామిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక వాహనంలో శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. మహాద్వారం నుంచి కేసీఆర్ దంపతులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా మంత్రులు శ్రీవారి ఆలయంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులకు టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ ఈవో సాంబశివరావు, మంత్రి బొజ్జల కృష్ణారెడ్డి ఘన స్వాగతం పలికారు.
అనంతరం శ్రీవారిని దర్శించుకున్న సీఎం దంపతులు, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న సీఎం దంపతులు, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రం ఏర్పడితే మొక్కు తీర్చుకుంటానన్న మొక్కు ప్రకారం రూ. 5కోట్ల విలువైన స్వర్ణాభరణాలను స్వామివారికి సమర్పించారు. రూ.3.7 కోట్ల విలువైన 14.2 కిలోల స్వర్ణ సాలగ్రామహారం, రూ.1.21 కోట్ల విలువైన 4.65 కిలోల కంఠాభరణాన్ని పూజలు నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ టీటీడీ ఉన్నతాధికారులకు అందజేశారు.
నిన్న ప్రత్యేక విమానంలో తిరుమలకు చేరుకున్న సీఎం బృందానికి ఘనస్వాగతం లభించింది. కేసీఆర్‌తోపాటు ఆయన కుమార్తె, ఎంపీ కవిత దంపతులు తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం, పద్మారావు, ఈటల, హరీశ్, అసెంబ్లీ స్పీక ర్ మధుసూదనాచారి, సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్పీసింగ్ సహా పలువురు శ్రీవారిని దర్శించుకున్నారు.
ఉదయం 11.30 కు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు సీఎం కేసీఆర్. అక్కడ అమ్మవారికి బంగారు ముక్కు పుడుకను సమర్పిస్తారు. మధ్యాహ్నం 12.30 కు తిరిగి రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరతారు.