లక్ష్మాపూర్ గ్రామానికి కేసీఆర్ వరాలు..

222
Kcr for Lakshmapur Village development
- Advertisement -

లక్ష్మాపూర్‌ గ్రామంలో లక్ష్మీదేవి తాండవించాలని  సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్‌లో  పర్యటించిన సీఎం గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లక్ష్మాపూర్ గ్రామ  ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వచ్చానన్న సీఎం ఆరు నెలల్లో  గ్రామ రూపు రేఖలు మారిపోవాలని తెలిపారు.

పల్లె జీవితం గొప్పగా ఉండాలని….అందుకు ప్రజలంతా సంఘటితం కావాలన్నారు. ఊరిలో ఒక్క కేసు లేకుండా చూడాలన్నారు.లక్ష్మాపూర్ చెరువును గోదావరి జలాలతో నింపుతామని, గ్రామస్తులు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని అన్నారు. చెరువు నిండిన తర్వాత కట్టపైకి తాను వస్తానని, దండిగా దావత్ చేసుకుందామని అన్నారు.

లక్ష్మాపూర్ గ్రామ అభివృద్ధికి రూ. 15 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అవసరమైతే ఇంకో కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్దమని తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. గ్రామానికి100 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. వంద శాతం లబ్దిదారులకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు దక్కాలన్నారు.

హరితహారంలో భాగంగా గ్రామస్థులు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు సీఎం. లక్ష్మాపూర్ ప్రజలు ఇంటికి 6 మొక్కల చొప్పున పెంచాలని సూచించారు.

అంతకముందు కేశవరం గ్రామసభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. సర్పంచ్, జేసీని అడిగి గ్రామ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక సదుపాయాల కోసం రూ. 12 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అవసరమైతే మరో రూ. 12 కోట్లు ఇస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల కోసం శనివారం మధ్యాహ్నం కల్లా జీవోలు ఇస్తామని చెప్పారు. ఆదివారం నుంచే పనులు ప్రారంభమవుతాయని సీఎం స్పష్టం చేశారు.

గ్రామంలో రూ. 75 లక్షలతో కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని సీఎం చెప్పారు. కేశవరంలో రూ. 30 లక్షల వ్యయంతో మహిళా వేదిక నిర్మిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే రిజిస్ట్రేషన్ మ్యుటేషన్‌లో మార్పులు తీసుకువస్తామని ప్రకటించారు. 15 రోజుల్లో కేశవరం రెవెన్యూ రికార్డులన్నీ మ్యుటేషన్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

- Advertisement -