KCR : కాంగ్రెస్‌పై కేసీఆర్‌ యుద్ధ భేరి

9
- Advertisement -

ప్రజాక్షేత్రంలో రంగంలోకి దిగనున్నారు గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ 9 నెలల పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టనున్నారు. సెప్టెంబర్‌ 10 తర్వాత తెలంగాణ ఉద్యమ తరహాలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను చూస్తుంటే తెలంగాణ కుప్పకూలే ప్రమాదం ఉందని బీఆర్‌ఎస్‌ సీనియర్లు కేసీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే వినాయకచవితి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు కనీస కార్యాచరణ లేకపోవడం, ప్రజల సమస్యలను పరిష్కరించే ధోరణి కనిపించకపోవడంతో సర్కారుపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు కేసీఆర్.

పార్టీ కీలక నేతలు, వివిధ వర్గాల ప్రముఖుల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో సెప్టెంబరు 10 నుంచి బీఆర్‌ఎస్‌ పోరాట కార్యాచరణకు సన్నాహాలు మొదలుపెట్టనున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా పార్టీ కార్యవర్గాన్ని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ప్రజా ప్రతినిధులతో విసృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ప్రధానంగా వ్యవసాయ రంగం కుదేలు కావడం, రైతుబంధు ఇవ్వకుండా, రైతు భరోసాను అమలు చేయకుండా కాంగ్రెస్‌ తమను నిలువునా ముంచిందన్న భావన అందరిలో ఉంది. ఇదే ప్రధాన అస్త్రంగా కేసీఆర్ తన పర్యటనల్లో ప్రజలకు వివరించే అవకాశం ఉంది. రుణమాఫీ ఇంకా అమలు కాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు.

అలాగే కల్యాణలక్ష్మి ,గృహిణులకు నెలనెలా రూ.2,500 ,గ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీ,దళితబంధు,గిరిజనబంధు, నిరుద్యోగ సమస్యలపై గళం విప్పనున్నారు కేసీఆర్. ఇందుకోసం పార్టీ రైతు, మహిళా, విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, యువత, మైనారిటీ విభాగాలను పూర్తిగా యాక్టివ్ చేసి కదన రంగంలోకి దించనున్నారు. కేసీఆర్ ప్రజలను కలిసేందుకు వస్తున్నారన్న వార్త బీఆర్ఎస్ శ్రేణుల్లోనే కాదు రాష్ట్ర రైతాంగంలోనూ కొత్త ఆశలను చిగురింపచేస్తోంది.

Also Read:TTD: మాడ వీధులను తనిఖీ చేసిన ఈవో

- Advertisement -