మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి చివరకు ఆమరణ దీక్షనే అస్త్రంగా సంధించిన కేసీఆర్ త్యాగఫలమే నేటి తెలంగాణ. ఆ మహాదీక్షను నెమరు వేసుకుంటూ ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. కళాకారులు డప్పు చప్పుళ్లు.. ఆటపాటలతో ఉత్సాహపరిచారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రజాకవి గోరటి వెంకన్న కళాకారులతో కలిసి చిందేసి హుషారెత్తించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, సినీనటుడు సుమన్‌తో పాటు పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉదయం ప్రారంభమైన దీక్షా దివస్ సాయంత్రం వరకు కొనసాగింది. సినీనటుడు సుమన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాదని చాలామంది అన్నారు, కేసీఆర్ దీక్ష చేపట్టడంతో తెలంగాణ ఇవ్వక తప్పలేదన్నారు. తెలంగాణ ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ అభివృద్ధి ప్రారంభమైందన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కేసీఆర్‌ను అభినందిస్తున్నారని, అక్కడ కూడా కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలను పొగుడుతున్నారని సుమన్ చెప్పారు. నవంబర్ 29న సెలవు ప్రకటించాలన్నారు. తెలంగాణ కథ ఇతివృత్తంగా నిర్మిస్తోన్న సినిమాలో తాను మంచి పాత్ర పోషిస్తున్నట్లు సుమన్ తెలిపారు.
తెలంగాణ సాధనకోసం కేసీఆర్ నిరాహారదీక్ష చేపట్టిన రోజుని చాలా పవిత్రమైన రోజుగా నాయిని అభివర్ణించారు. దీక్ష కోసం ఆనాడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పాల్గొనలేదని గుర్తు చేశారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా తీర్చిదిద్దుకుందామని నాయిని అన్నారు.
తన సొంత నియోజకవర్గం సిద్దిపేటలో ఇవాళ మంత్రి హరీష్‌రావు దీక్షా పైలాన్ వద్ద అమర వీరులకు నివాళులర్పించారు. ఇక్కడి రైతు బజార్‌లో క్యాష్‌లెష్ లావాదేవీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ కళ సాకారమైందని తెలిపారు.