ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కేసీఆర్.. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఆసరాగా చేసుకుని కేంద్రంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. “ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ఏముంది? అభివృద్ధి కాంక్షించే ప్రభుత్వం ఉన్నట్లైతే.. ఇరిగేషన్ ఫైల్స్, ఎకనమిక్ ఫైల్స్ ఉండాలి. ద కశ్మీర్ ఫైల్స్ ను ఎవరు కోరారు? ఈ చిత్రాన్ని ఓట్ల కోసమే వాడుకుంటున్నారని ఢిల్లీలో కొందరు కశ్మీరీ పండిట్లు చెబుతున్నారు. ఇప్పటిదాకా తమకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని కూడా వారు ఆరోపిస్తున్నారు” అంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై యువత ఆలోచించాలని కేసీఆర్ సూచించారు.
నిన్న, ఈరోజు చూస్తున్నాం.. సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారు. అవాంఛనీయమైన, అనారోగ్యకరమైన ఏ రకంగా కూడా ఆహ్వానించతగనటువంటి.. కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాను తీసుకొచ్చారు. కశ్మీర్ ఫైల్స్ తో వచ్చేది లేదు. పోయేది లేదు. తెలంగాణ సమాజానికి అసలు జీర్ణం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం దశాబ్దాల తరబడి ఉధృతంగా చేశాం. సకల జనుల సమ్మె అనే పిలుపునిచ్చాం. కానీ హిందువుల సమ్మె, క్రైస్తవుల సమ్మె, ముస్లింల సమ్మె అని పిలుపు ఇవ్వలేదని కేసీఆర్ గుర్తు చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సెలువులు ఇచ్చి కశ్మీర్ ఫైల్స్ సినిమాను చూడమన్నారు. ఈ దేశం ఎటు వైపు పోతోంది. ఇదేం విభజన రాజకీయం. ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఒక మంచి వాతావరణాన్ని పాడు చేస్తున్నారు. దేశం నుంచి 5 లక్షల కోట్ల సాప్ట్ వేర్ ఎగుమతులు ఉన్నాయి. ఈ విభజన రాజకీయాల వల్ల అనేక ఇబ్బందులు వస్తాయన్నారు. ప్రభుత్వ అసమర్థత బయటపడిందని కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు.