తెలంగాణ రాష్ట్రానికి సరైన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతల సమావేశానికి ముఖ్యఅతిధిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ దేశ చరిత్రలో నిలిచిపోతారన్నారు. తెలంగాణను సాధించడంతో పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్.. రెండోసారి ప్రజల ఆశీర్వాదం పొందారన్నారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మారని చెప్పారు. అందుకు మొన్న జరిగిన ఎన్నికలే కారణం అన్నారు. ప్రధాని, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 28లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఉద్యమ స్ఫూర్తితో ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించాలి. 103 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతు అయ్యాయి.
పేదప్రజలు టీఆర్ఎస్ పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదని కార్యకర్తలకు సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు సాధించి కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి నామినేటెడ్ పదవులు తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు