తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా భగవంతుడు దీవించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.
వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి భక్తులకు మహాలఘు దర్శనం కల్పిస్తున్నారు. హన్మకొండ వేయిస్తంభాల గుడిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.
కాళేశ్వరంలో వైభవంగా శివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, గోదావరి మాతకు పూజలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు.