దేశ రాజకీయాలకు కొత్త దిశ చూపించే సత్తా కేసీఆర్‌కే ఉందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. హన్మకొండలో మీడియాతో మాట్లాడిన కడియం…తెలుగు ప్రజలంతా కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలన్నారు. ఆనాడు ఎన్టీఆర్ తెలుగు వాణిని ఢిల్లీలో ఎలుగెత్తి చాటారని.. నేడు కేసీఆర్ మళ్లీ అదే చేయబోతున్నారని అన్నారు. తృతీయ ఫ్రంట్‌కు నాయకత్వం వహించే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ మాత్రమే అన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్,బీజేపీ ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయన్నారు. కాంగ్రెస్ స్కాంలల్లో కూరుకుపోతే…బీజేపీ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. తెలంగాణపై ఒక రకమైన వివక్ష… ఏపీపై మరో రకమైన వివక్షను కేంద్రం చూపుతోందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతున్నా కేంద్రం సహకరించడంలేదని…. ప్రత్యేక హోదాను థర్డ్ ఫ్రంట్ ద్వారా సాధించుకోవచ్చని సూచించారు కడియం.
ఆర్థిక నేరగాళ్లను అదుపు చేయడంతో మోడీ ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఈ పరిస్థితి పోయి ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్, భాజపాయేతర పార్టీలతో థర్డ్ ఫ్రంట్ రావాలన్నారు. వామపక్షాలు కూడా తమ అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు.