ఓ వైపు రాజకీయాలు,సంక్షేమ కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే సీఎం కేసీఆర్ తన ఆప్తమిత్రులను సమయం దొరికినప్పుడల్లా కలుస్తున్న విషయం తెలిసిందే. అంతేగాదు గురువులను,పెద్దవారిని గౌరవించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇక వరాలు కురిపించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ఇదే విషయాన్ని రాజకీయాలకు అతీతంగా అన్నిపార్టీల నేతలు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. తాజాగా తన బాల్యమిత్రుని విషయంలోనూ ఇదే చేశారు కేసీఆర్. కలలో కూడా ఊహించని పదవిని కట్టబెట్టి ఆ మిత్రున్ని సంభ్రమాశ్చార్యాల్లో ముంచెత్తారు.
మెదక్ జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన బొమ్మెర వెంకటేశం,సీఎం కేసీఆర్ బాల్య స్నేహితులు. ఒకటి నుంచి ఐదో తరగతి దాకా ఇద్దరూ దుబ్బాకలో కలిసి చదువుకున్నారు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని వీడలేదు. ఇక ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనను నేరుగా కలిసే కొంతమందిలో ఒకరిగా వెంకటేశంకు ఇచ్చారు. ఈ సందర్భంగా తనకు ఏదైనా దేవాలయంలో డైరెక్టర్ పదవిని ఇస్తే భగవంతుడి సేవలో తరిస్తానని సీఎంతో అంటుండేవారు.
ఈ నేపథ్యంలోనే మంథని నియోజక వర్గ పరిధిలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌గా నియమించి స్నేహమంటే ఇదేరా అనిపించుకున్నారు కేసీఆర్. తనను డైరెక్టర్‌గా నామినేట్ చేశారని మాత్రమే బొమ్మెరకు తెలుసు. మంగళవారం ఉదయం పత్రికలో వచ్చిన వార్తను చూసి బొమ్మెర ఆశ్చర్యపోయారు. మంత్రి టి.హరీశ్‌రావును కలిసి నియామక పత్రాన్ని అందుకున్నారు. తనను ఆలయ ఛైర్మన్‌గా నియమించిన సీఎం కేసీఆర్,మంత్రి హరీష్‌కు కృతజ్ఞతలు తెలిపారు వెంకటేషం.