వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్…

160
- Advertisement -

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెడతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులను ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు  తీసుకుంటామని…రైతులకు పెట్టుబడిగా అందించే నిధులతోపాటు మద్దతు అందించడం కోసం కొంత నిధిని కూడా బడ్జెట్‌లో కేటాయిస్తామన్నారు.  ప్రగతిభవన్‌లో వ్యవసాయంపై సమీక్ష నిర్వహించిన సీఎం…రైతులు సుస్థిరంగా ఉంటేనే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందన్నారు.

సమైక్యరాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేశారని, తెలంగాణలో ఆపరిస్ధితి మారాలన్నారు.  సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. చెరువులు పునరుద్ధరించాం. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశాంమని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించే విషయంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్య కార్యదర్శి పార్థసారథి నాయకత్వంలో అధికారులు విశేషకృషి చేశారని సీఎం కేసీఆర్ అభినందించారు.

వ్యవసాయదారులు తీవ్ర నిరాశానిస్పృహల్లో కూరుకుపోయి తమనెవరూ పట్టించుకోరు అనే భావనలో ఉన్నారని, తమ ఖర్మ ఇంతే అనుకుంటున్న రైతుల్లో ధైర్యం నింపాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. వారికి చేయూత అందించి, అండగా నిలువాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల కొంతమార్పు వచ్చిందని తెలిపారు. రైతులకు మేలు జరుగుతుందన్నారు.

CMKCR
మద్దతుధర విషయంలో కేంద్రంకూడా మరింత ఉదారంగా వ్యవహరించాల్సి ఉందని తెలిపారు సీఎం. వరి, మక్కలకు మద్దతుధర పెరుగాల్సి  ఉందని.. ఈ రెండింటికీ రూ.2 వేల మద్దతుధర ప్రకటించాలన్నారు. కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు అసలు మద్దతుధరే లేదు. కాబట్టి దేశంలో పండే ప్రతి పంటకు మద్దతుధర ప్రకటించేలా కేంద్ర విధానం ఉండాలని సూచించారు.  మే 15 నాటికి మొదటివిడుతగా ఎకరానికి రూ.4 వేల చొప్పున పెట్టుబడిని రైతులకు అందిస్తామన్నారు.

వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకాన్ని ఎలా అమలుచేయాలి? రైతులకు డబ్బులు నేరుగా అందివ్వాలా? బ్యాంకుల ద్వారా అందివ్వాలా? సాగుచేస్తున్న భూములను గుర్తించడం ఎలా? ఏ ప్రాతిపదికన పెట్టుబడి అందించాలి? తదితర అంశాలను అధ్యయనం చేయడానికి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం నియమించారు. ఈ కమిటీలో మంత్రులు ఈటల రాజేందర్, టీ హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -