కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో హైదరాబాద్‌కు వస్తున్న ఓ బస్సును ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో 8 మంది హైదరాబాదీలు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రమాదం జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అంతేకాదు మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసాయం అందేలా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మృతదేహాలను వారి స్వస్థలానికి తరలించేలా చర్యలు తీసుకోవాలంటూ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావులకు నిర్దేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలని సూచించారు. మృతుల మరణం పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు సీఎం కేసీఆర్.

