భర్త అనిల్‌తో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నాలుగేళ్లుగా ఎదుర్కొన్న మనోవేదన స్వామివారి కృపతో తొలగిపోయిందని ఆమె భావోద్వేగంగా తెలిపారు. తిరుమల శ్రీవారికి మొక్కు పెట్టుకున్నట్లు చెప్పిన కవిత, అది నెరవేరడంతో కాలినడకన తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుని తన మొక్కు తీర్చుకున్నట్లు వెల్లడించారు.
సత్యం, న్యాయం, ధర్మం తమ వైపే ఉన్నాయని మొదటి నుంచి చెబుతున్నామని, ఇప్పుడు స్వామివారి దయతో తాము నిర్దోషులమని తేలడంతో ఎంతో ఆనందంగా ఉందని కవిత అన్నారు. దేవుడిపై ఉన్న నమ్మకమే ఈ కష్టకాలాన్ని దాటించిందని ఆమె పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులతో తిరిగి ప్రజల సేవలో మరింత చురుకుగా పనిచేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె రాజకీయ భవిష్యత్తుపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన పని చేసేలా, తెలంగాణ ఇంటి పార్టీగా నిలిచే ఒక కొత్త రాజకీయ పార్టీని రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల సమస్యలను దగ్గరగా పరిష్కరించడమే తమ లక్ష్యమని తెలిపారు.
Also Read:వృషకర్మ..బెస్ట్ మూవీ!
తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా ముందుకు సాగుతామని కవిత స్పష్టం చేశారు.

