సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ 9 ఎంపీ స్ధానాలను సాధించిన సంగతి తెలిసిందే. మెజార్టీ స్థానాలు సాధించినా కీలకనేతలు కవిత,వినోద్ కుమార్ ఓడిపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ సైతం వీరిద్దరితో పాటు మిగితా స్థానాల్లో పార్టీ ఓటమికి గల కారణాలేంటి అనేదానిపై ఆరా తీస్తున్నారు.
తెలంగాణ తొలి ప్రభుత్వంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు,ప్రాజెక్టులపై కేంద్రంతో పోరాడి సాధించారు కవిత,వినోద్. పార్లమెంట్లో తెలంగాణ గొంతుక బలంగా వినిపించారు. అయితే వీరిద్దరి ఓటమితో క్యాడర్ కాస్త నిరాశ చెందిన త్వరలోనే వీరికి సముచిత స్ధానం కల్పించేలా వ్యూహరచన చేస్తున్నారు కేసీఆర్.
ఈ నేపథ్యంలో కవితకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ మాత్రం కవితను బ్యాక్ డోర్(ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ) ఇచ్చేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి ఓటమిపాలైన కవితను తిరిగి ప్రజాక్షేత్రంలోనే గెలుపొందేలా చేయడం ద్వారా పట్టుసాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం హుజుర్ నగర్ స్థానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన ఉత్తమ్..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉండటంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. దీంతో ఈ స్థానం నుంచి కవితను పోటిచేయించి భారీ మెజార్టీతో గెలిచేలా స్కెచ్ వేస్తున్నారు సీఎం.
ఇక హుజుర్ నగర్ స్ధానం నుంచి ఉత్తమ్ కుమార్ భార్య పద్మావతి పోటీ చేసే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో పద్మావతి కోదాడ నుంచి పోటీచేసిన ఆమె ఓటమిపాలైంది. ఇక హుజుర్ నగర్ నుంచి ఉత్తమ్ కేవలం 7500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పద్మావతికి పోటీగా కవితను బరిలో దింపడం ద్వారా టీఆర్ఎస్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని సీఎం భావిస్తున్నారు.నిజామాబాద్‌లో ఓడిపోయినా హుజుర్‌నగర్‌లో గెలిచిందనే సంకేతి ప్రజల్లోకి బలంగా వెళ్తుందని పార్టీ నేతలతో సీఎం చర్చించారని సమాచారం.
ఇక సీనియర్ నేత వినోద్‌ను సైతం రాజ్యసభకు పంపే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. 2020 ఏప్రిల్‌లో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. గరికపాటి మోహన్ రావు,కేవీపీ ఇద్దరి పదవి కాలం ముగియనుండటంతో ఒక స్ధానాన్ని వినోద్‌తో భర్తి చేయాలని భావిస్తున్నారు కేసీఆర్. వినోద్‌కు ఉన్న పరిచయాలు, ఏ అంశంపైనైనా మాట్లాడే పట్టు ఉండటంతో ఆయన్ని రాజ్యసభకు పంపాడం ద్వారా తెలంగాణకు లాభిస్తుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. వీరిద్దరితో పాటు కేబినెట్ విస్తరణలో భాగంగా మిగిలిన ఆరుగురిలో పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో పాటు కడియం శ్రీహరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సీఎం కేసీఆర్ వ్యూహరచన ఎలా ఉండబోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.