రాష్ట్రంలోని ప్రతి వెనుకబడిన కులం ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేదే సీఎం కేసీఆర్ అభిమతమమన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో 47 బీసీ సంఘాల ప్రతినిధులు సోమవారం రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కవితను నగరంలోని కవిత నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత… బీసీ కులాల బాంధవుడు సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని కుల సంఘాలు కేసీఆర్ వెంట నడిచిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కారణంగానే కరోనా సమయంలో సైతం గ్రామాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు.బీసీల సంక్షేమంలో సీఎం కేసీఆర్ ఎందరికో స్ఫూర్తిదాయకమని…. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల కోసం వేల కోట్ల నిధులు కేటాయిస్తుందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య .
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో త్వరలోనే అన్ని బీసీ కులాలతో వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం అవసరమైన అన్ని అంశాలను ఈ వర్క్ షాప్‌లో చర్చిస్తామన్నారు. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా బీసీలను పట్టించుకోలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ బీసీల కోసం కళ్యాణలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు.