నిజామాబాద్ ఆసుపత్రుల్లో పేదలకు ఉచిత భోజనాలు, కష్టాల్లో ఉన్న వారికి అడిగిన వెంటనే ఆసరాగా నిలబడటం…దేశ విదేశాల్లో ఆపదలో ఉన్న వారికి నిత్యావసరాలు, బియ్యం, ఆర్థిక చేయూత…ఇలా కష్టం ఎక్కడున్నా ఆదుకోవడానికి నేనున్నా అంటూ ముందుకు వచ్చే నాయకురాలు మాజీ ఎంపీ కవిత. తాజాగా కరోనా వ్యాధి నివారణలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు ఏకంగా 20వేల రీ యూజబుల్ క్లాత్ మాస్కులు అందించారు. అంతేకాదు కరోనాపై పోరాటంలో కీలకంగా ఉన్న వైద్యులకు 500 PPE కిట్స్ అందించారు.
నిజామాబాద్ జిల్లాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా నివారణకై ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యులు మరియు ఇతర ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కరోనా నివారణ చర్యల్లో మాస్కుల పాత్ర చాలా కీలకం. దీంతో నిజామాబాద్ ప్రజలకు మాస్కుల విషయంలో ఎలాంటి కొరతా రాకుండా ఉండాలని సంకల్పించిన మాజీ ఎంపీ కవిత 20 వేల మాస్కులను అందించారు. దీంతో పాటు క్వారంటైన్ సెంటర్లలో, కరోనా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యుల రక్షణ కోసం 500 పీపీఈ కిట్స్ ను అందించారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో, నూడా ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాస్కులు, పీపీఈ కిట్లను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, పీపీఈ కిట్లు ఉంటే, వైద్యులు మరింత విశ్వాసంతో పనిచేస్తారని, వైద్యుల్లో అభద్రతా భావాన్ని తొలగిస్తాయన్నారు. అంతేకాదు 20 వేల మాస్కులను ఉద్యోగులకు, వ్యవసాయ రంగం,ఉపాధి హామీ రంగాల్లో పనిచేసే వారికి అందజేస్తామన్నారు. పీపీఈ కిట్లు, మాస్కులను అందజేసిన మాజీ ఎంపీ కవిత గారికి నిజామాబాద్ జిల్లా ప్రజల తరుపున కలెక్టర్ నారాయణ రెడ్డి మరియు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సూధం రవిచందర్, నరేష్ రెడ్డి గారు పాల్గొన్నారు.
కరోనా ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు, వలస కూలీల కోసం మాజీ ఎంపీ కవిత, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఆరు అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.