నందమూరి బాలకృష్ణ నటించిన 102వ చిత్రం జై సింహా సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమాపై ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ రివ్యూ ఇచ్చేశాడు. మరో సంక్రాంతి సినిమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని ట్వీట్ చేశారు కత్తి.
1980ల నాటి కథకి 1990ల నాటి కథనం జై సింహా అని…సినిమా కథకు గతి లేదని, గమనం లేని కథనంతో కొనసాగిందని చెప్పారు. ముగ్గురు హీరోయిన్లు ఎందుకు ఉన్నారో కూడా తెలియదని చెప్పారు. కథ, కథనం బాగోలేకపోవడంతో రవికుమార్ దర్శకత్వ ప్రతిభ మరుగున పడిపోయిందని చెప్పారు.
కథలో బాలయ్య ఉంటారే తప్ప, బాలయ్య వల్ల కథ నడవదని మహేష్ చెప్పారు. బాలయ్యకు తగ్గ హీరోయిజం, బలం ఆ పాత్రలో లేదని అన్నారు. ఫైట్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయని చెప్పారు. ముగ్గురు హీరోయిన్లలో నయనతార పాత్ర కొంచెం బాగానే ఉన్నప్పటికీ, మిగిలిన వారికి అంత స్కోప్ లేదని తెలిపారు. బ్రహ్మానందంలాంటి కమెడియన్లు ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లో కామెడీ పండలేదని, సెంకండ్ హాఫ్ లో కామెడీనే లేదని చెప్పారు. భట్ సంగీతం రెండు పాటల్లో మాత్రమే బాగుందని అన్నారు.
ఫస్ట్ హాఫ్ లో కథ ఎటు వెళ్తోందో అనే సందేహంలో మనం ఉంటామని అన్నారు. చివరి పది, పదిహేను నిమిషాల్లో అది బాలయ్యకు సంబంధించిన సెంటిమెంట్ కథ అని మనకు అనిపిస్తుందని చెప్పారు. మొత్తంగా బాలయ్య అభిమానులను కూడా నిరాశపరిచే విధంగా ఉందని అన్నారు.
80ల కథకి, 90ల కథనం. గతిలేని కథ. గమనం లేని కథనం. వెరసి ఒక కలగురగంప సినిమా "జై సింహ". నిరర్ధకమైన కథలోని అసంబద్ధమైన పాత్రలో బాలయ్య. ఎందుకు ఉన్నామో తెలీని హీరోయిన్లు ముగ్గురు. అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా!
— Kathi Mahesh™️ (@kathimahesh) January 12, 2018