తెలుగు రాష్ట్రాల్లో చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పిస్తానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చేనేత గర్జనతో తన వాయిస్ వినిపించిన పవన్ .. తన తాజా మూవీ కాటమరాయుడులో పూర్తిగా చేనేత వస్త్రాల్లోనే కనిపించనున్నాడట. కాటమరాయుడు సినిమా షూటింగ్ ప్రారంభమైన తొలి రోజు నుంచే పవన్ చేనేత వస్త్రాలను ధరిస్తున్నాడని, షూటింగ్ టాకీ పార్ట్ పూర్తయ్యే ముందు చేనేత వస్త్రాలకు ప్రచారం నిర్వహించేందుకు పవన్ ముందుకొచ్చాడని కాస్ట్యూమ్ డిజైనర్ తెలిపింది.
ఒక కాటమరాయుడు షూటింగ్ లో పవన్ కల్యాణ్ .. మగ్గంపై దుస్తుల తయారీని పరిశీలించే సీన్ ఉంది. ఇటీవల మెదక్ జిల్లాలో సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సమయంలో నేతన్నల దగ్గరకి వెళ్లి మరీ.. ఎలా నేస్తారు.. ఎంత సమయం పడుతుంది.. ఎంత ఖర్చు అవుతుంది.. ఎంత ధరకు అమ్ముతున్నారు.. గిట్టుబాటు అవుతుందా లేదా.. ప్రభుత్వ సాయం ఎలా ఉంది అని ఆరా తీశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. నేతన్నతో జనసేనాని అంటూ సోషల్ మీడియా వైరల్ అయ్యాయి.
ఇక తెలంగాణలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సమంత వివిధ ప్రాంతాల్లో పర్యటించి నేతన్నల కష్టాలను తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చేనేత వస్త్రాలను ప్రమోట్ చేసేందుకు తనవంతు కృషి చేస్తున్న సమంతపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. దుబ్బాక, పోచంపల్లిలో పర్యటించి నేతన్నకు ధైర్యం చెప్పిన విధానానికి మంత్రి హ్యాట్సాఫ్ చెప్పారు. నేతన్న ఎదుర్కొంటున్న సమస్యలు సమంత తెలుసుకుంటున్నారని.. వాటిని ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. సమంత ఎంత బిజీగా ఉన్నప్పటికీ నేతన్న కోసం సమయం కేటాయించడం నిజంగా హర్షించదగ్గ విషయమని కేటీఆర్ ప్రశంసించారు.