తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 4న నిర్వహించనున్న సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవానికి టీటీడీ ఘన ఏర్పాట్లు చేసింది. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ విశిష్ట ఉత్సవం తిరుమల ఆలయానికి ప్రత్యేకతను చాటుతుంది. శ్రీవారి సాయంకాల సేవలు, నివేదనలు పూర్తయ్యాక దీపోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ముందుగా సాయంత్రం నేతి వత్తులతో దీపాలను వెలిగించి శ్రీవారిని ఆలయ ప్రాకారాల్లో ప్రత్యేకంగా అలంకరించిన ఛత్రచామర, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తారు. అనంతరం ఆనంద నిలయంలో శ్రీవారికి మహా హారతి సమర్పిస్తారు. దీని తరువాత ఆలయ పరిసరాల్లోని ప్రధాన సన్నిధులన్నింటిలో దీపాలను ఏర్పాటు చేస్తారు.
ఈ క్రమంలో వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత ఆలయం, బంగారు బావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి తదితర ప్రాంతాల్లో దీపాలను వెలిగిస్తారు. ఈ వెలుగుల అందాలతో తిరుమల ఆలయం మరింత ఆధ్యాత్మిక కాంతితో మెరవనుంది.
Also Read:అఖండ తాండవం..హై మూమెంట్స్!
ఈ ఉత్సవం నిర్వహణ కారణంగా డిసెంబర్ 4వ తేదీన జరిగే సహస్రదీపాలంకరణ సేవతో పాటు పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం భక్తుల రద్దీని సమన్వయం చేయడం మరియు దీపోత్సవ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహించడానికేనని అధికారులు తెలిపారు.

