ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి అలయంలో కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తయిన తరువాత ఈ దీపోత్సవాన్ని కన్నుల పండుగగా చేపట్టారు.ఆదివారం సాయంత్రం 5 గంటలకు దీపోత్సవం ప్రారంభమైంది. మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళం అర దగ్గర 100 కొత్త మూకుళ్ళలో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు.
తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభేరా, తాళ్లపాక వారి అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా 100 నేతిజ్యోతులను మంగళవాయిద్యాల నడుమ ఏర్పాటు చేశారు.
Also Read:మొక్కజొన్న పీచుతో ఉపయోగాలు..!