తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, బి.సి.కమిషన్ పనితీరును కర్ణాటక బి.సి.కమిషన్ చైర్మన్ జయప్రకాష్ ప్రశంసించారు. నియామకమైన మూడు నెలల్లోనే తెలంగాణ బి.సి.కమిషన్ అనుసరిస్తున్న చట్టపరమైన విధివిధానాల పట్ల ఆయన అభినందనలు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర బి.సి.కమిషన్ కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులు సి.హెచ్.ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె.కిషోర్ గౌడ్, మెంబర్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఐ.ఏ.ఎస్ లను కర్ణాటక బి.సి. కమిషన్ చైర్మన్ జయప్రకాష్ హెగ్డే సభ్యులు రాజశేఖర్, ఎస్.హెచ్.కళ్యాణ్ కుమార్, సువర్ణ కె.టి, అరుణ్ కుమార్ లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ బి.సి.కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు ప్రసంగిస్తూ… త్వరలో దక్షిణాది రాష్ట్రాల బి.సి.కమిషన్ ల సమావేశం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు అందజేసిన టిఓఆర్ (Terms Of Reference) ఆధారంగా నిర్దిష్టమైన అధ్యయనం మొదలు పెట్టినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ఆరంభించి నివేదిక సమగ్రంగా ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. బిసి లకు బాసటగా తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
సభ్యులు సి.హెచ్. ఉపేంద్ర మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఎం.బి.సి కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. మరో సభ్యుడు శుభ ప్రద పటేల్ మాట్లాడుతూ… దేశంలోనే దక్షిణాది రాష్ట్రాలలో తొలిసారిగా కుల గణన చేపట్టాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రాన్ని కోరిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని అన్నారు. మరో సభ్యుడు కిషోర్ గౌడ్ ప్రసంగిస్తూ… దేశంలోకెల్లా నాణ్యమైన విద్యను మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలల ద్వారా ఉత్తమంగా అందిస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. సభ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ వేలాది కోట్లు వెచ్చించి దేశంలోని అనేక పథకాలతో తెలంగాణ అగ్రభాగాన ఉందని పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి, రెసిడెన్షియల్ పాఠశాలలు, బి.సి సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల పై ఆయన సమగ్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.
కర్ణాటక బి. సి. కమిషన్ చైర్మన్ జయ ప్రకాష్ హెగ్డే మాట్లాడుతూ… తెలంగాణలో అమలులో ఉన్న అనాధల రిజర్వేషన్లపై ఆయన ప్రత్యేకంగా అడిగి వివరాలు సేకరించారు. అక్కడి సభ్యులు రాజశేఖర్, ఎస్.హెచ్.కళ్యాణ్ కుమార్, అరుణ్ కుమార్, సువర్ణ లు కర్ణాటక మిషన్ చట్టం, అక్కడి సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. రాష్ట్ర బి.సి.కమిషన్‌లో భేటీ అయిన సందర్భంగా కర్ణాటక బి.సి.కమిషన్ చైర్మన్, సభ్యులకు జ్ఞాపిక, శాలువా, పుష్పగుచ్చం సన్మానించారు.
ఈ సందర్భంగా కర్ణాటకకు చెందిన ప్రామాణికమైన బి. సి. కమిషన్ లు అయిన ఓ చిన్నపరెడ్డి, హవనూర్ కమిషన్ నివేదికల తెలుగు అనువాద ప్రతులను అందజేయడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన టి.ఓ.ఆర్ పై జరుగుతున్న అధ్యయనంలో భాగంగా తెలంగాణ రాష్ట బిసి కమిషన్ కర్ణాటక రాష్ట్రాన్ని సందర్శించాలని ఛైర్మన్ జయప్రకాశ్ హెగ్డే కోరారు. శుక్రవారం నాడు తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర కమిషన్ చైర్మన్ లు, సభ్యులు వర్గల్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే డిగ్రీ కళాశాల సందర్శించనున్నారు.